శారీరక సంబంధం కోసం దారుణం..ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య

హన్మకొండ జిల్లా, పరకాలలో దారుణం
ఆధారాలు దొరక్కుండా పెట్రోల్ పోసి తగులబెట్టిన నిందితులు
భార్య, ప్రియుడు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు
హన్మకొండ జిల్లా: హన్మకొండ జిల్లా పరకాలలో వివాహేతర సంబంధం కారణంగా దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. భర్త తన సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పరకాలకు చెందిన సుమన్ అనే వ్యక్తి స్థానికంగా ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య లావణ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే సమయంలో లావణ్యకు కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన తర్వాత భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.
ఈ క్రమంలో భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న లావణ్య, తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడానికి కుట్ర పన్నింది. ఇందుకోసం ఒక ముఠాకు సుఫారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం కొద్దిరోజుల క్రితం లావణ్య తన పుట్టింటికి వెళ్లింది. ఇదే సమయంలో ఈ నెల 3వ తేదీ నుంచి సుమన్ కనిపించకుండా పోయాడు.
కొడుకు కనిపించకపోవడంతో సుమన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భార్యపై అనుమానం వ్యక్తమైన పోలీసులు ఆమెను ప్రశ్నించగా, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించినట్లు అంగీకరించినట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం, సుఫారీ తీసుకున్న ముఠా సభ్యులు సుమన్‌పై బీరు సీసాలతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. అనంతరం ఆధారాలు దొరక్కుండా ఈ నెల 4వ తేదీన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దయ్యాలవాగు సమీపంలో మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు తెలిపారు.
సంఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు భార్య లావణ్యతో పాటు ఆమె ప్రియుడు, సుఫారీ తీసుకున్న ముఠా సభ్యులు సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

error: Content is protected !!
Prajaveek Shanam