సైదాపురం–డేగపూడి రహదారి దుస్థితిపై ప్రజల నిరసనడబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్

నెల్లూరు జిల్లా: సైదాపురం–డేగపూడి రహదారి గత పన్నెండేళ్లుగా గోతులతో దారుణ స్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేస్తూ తుమ్మల తలుపూరు ప్రాంత ప్రజలు హనుమాన్ జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గత ఐదేళ్లుగా మైనింగ్‌కు సంబంధించిన హెవీ లోడ్ల రాకపోకల కారణంగా రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు “మాకు డబుల్ రోడ్డు కావాలి, వెంటనే పనులు ప్రారంభించాలి” అంటూ నినాదాలు చేశారు. గ్రామస్తుడు దుగ్గిశెట్టి సాయి శరణ్ మాట్లాడుతూ, సైదాపురం నుంచి డేగపూడి వరకు రహదారి భారీ గోతులతో నిండిపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రహదారులు అభివృద్ధి చెందుతున్నప్పటికీ తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పయ్యాల వేణు నాయుడు మాట్లాడుతూ, డేగపూడి నుంచి కలిచేడు వరకు రహదారి అత్యంత ప్రమాదకరంగా మారిందని, వాహనాలు సైడ్‌కు దిగితే పడిపోయే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. ఈ రహదారిపై ప్రయాణం చేయడం ప్రాణాలకు ముప్పుగా మారిందని అన్నారు.పసుపులేటి మల్లిఖార్జున్ మాట్లాడుతూ, ఈ ప్రాంతం నుంచి కోట్లాది రూపాయల ఖనిజ ఆదాయం వస్తున్నప్పటికీ రహదారి అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించడం లేదని విమర్శించారు. ఈ రహదారిపై ప్రమాదాలు జరిగినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రహదారుల దుస్థితిపై స్పందిస్తున్న నేపథ్యంలో, ఈ ప్రాంత రహదారి అభివృద్ధిపైనా స్పందించాలని ప్రజలు కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి స్పందించి, రూ.47 కోట్ల CSR నిధులు వెనక్కి వెళ్లకుండా వెంటనే డబుల్ రోడ్డు పనులు ప్రారంభించాలని తుమ్మల తలుపూరు ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam