మహిళలపై లైంగిక వేధింపులు, గృహహింసలపై ప్రజలకు అవగాహన.
… కే.కోటపాడు ఎస్ఐ: రాజాన ధనుంజయ్.
కే.కోటపాడు, ఏప్రిల్ 24 (ప్రజా వీక్షణం)
మహిళలపై లైంగిక వేధింపులు, గృహహింసలపై, బాలల అక్రమ రవాణా వంటి వాటికి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, కే.కోటపాడు ఎస్ఐ రాజాన ధనుంజయ్ అన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని చౌడువాడ గ్రామంలో రామ కోవెల వద్ద ప్రజలకు, మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
గృహ హింస, బాలల లైంగిక దుర్వినియోగం, మహిళలపై లైంగిక వేధింపులు, స్త్రీలు మరియు బాలల అక్రమ రవాణా (ట్రాఫికింగ్) వంటి ముఖ్యమైన అంశాలపై గ్రామస్తులకు వివరించారు.
గృహ హింస ఒక శిక్షార్హ నేరమని, ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాలలపై లైంగిక దుర్వినియోగాన్ని అరికట్టడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మహిళలపై లైంగిక వేధింపులు జరగకుండా సమాజం మొత్తం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్త్రీలు మరియు బాలల అక్రమ రవాణా (ట్రాఫికింగ్) వంటి నేరాలను గుర్తించి వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 / 112 కు కాల్ చేయాలని, మహిళలు మరియు పిల్లల రక్షణకు సంబంధించిన హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.













