
వాకాడు: ఎప్రిల్ 25 (ప్రజా విక్షణ)
వాకాడు మండల కేంద్రంలోని జనార్దన్ రెడ్డి కాలనీ ఎదురుగా శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోట నుంచి మల్లం వైపు వెళ్తున్న బైక్‌ను దుగ్గరాజుపట్నం వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది.మల్లం హరిజనవాడకు చెందిన వాకాటి నితిన్ అనే యువకుడు కోట నుంచి వాకాడు మీదుగా మల్లం వెళ్తుండగా, బీసీ కాలనీకి చెందిన ఆటో అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో నితిన్ బైక్‌తో పాటు రోడ్డుపక్కన ఉన్న సబ్‌స్టేషన్ ఎదుట స్తంభాలపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని కాలు విరిగినట్లు సమాచారం ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆటోలో డ్రైవర్ ఒక్కరే ఉండగా, ప్రమాద సమయంలో ఆటోలోని స్పీకర్లు, సీట్లు బయటకు ఎగిరిపడినా పట్టించుకోకుండావెళ్లిపోయాడని, అతడు మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే వాకాడు సబ్ఇన్స్పెక్టర్ నిఖిల్ బాబు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం గాయపడిన నితిన్‌ను వాకాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు కాలు విరిగినట్లు గుర్తించి మెరుగైన చికిత్స కోసం గూడూరుకు తరలించాలని సూచించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఆటో వాకాడు బీసీ కాలనీకి చెందినదిగా గుర్తించినట్లు సమాచారం. గాయపడిన వ్యక్తిని పట్టించుకోకుండా డ్రైవర్ పరారవడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు ఎదురుగా వచ్చి ఉంటే ప్రాణనష్టం జరిగేదని, ఇటువంటి నిర్లక్ష్య డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.












