
గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇస్కాన్ ప్రచార కేంద్రం ఆధ్వర్యంలో చిన్నారుల్లో నైతిక విలువలు, ఆధ్యాత్మిక భావజాలం పెంపొందించేందుకు చిల్డ్రన్స్ సమ్మర్ క్యాంప్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రచార కేంద్రం గూడూరు ఆచార్యులు బలభద్ర గోపాలదాసు ప్రభు ఆధ్వర్యంలో నిర్వహించబడగా, నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు శ్రీ లక్ష్మీ – పీఎం రావు దంపతులు చేతుల మీదుగా క్యాంప్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ చిన్నారులకు చిన్న వయస్సులోనే ఆధ్యాత్మికతపై అవగాహన కల్పించడం ద్వారా వారి వ్యక్తిత్వ వికాసం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఆధునిక కాలంలో పిల్లలు సాంకేతికతకు అలవాటు పడుతున్న నేపథ్యంలో, సంస్కారం మరియు సనాతన ధర్మ విలువలు తెలియజేయడం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు.ఈ సమ్మర్ క్యాంప్‌కు 70 మందికి పైగా చిన్నారులు ఉత్సాహంగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా హరినామ కీర్తనలు, భజనలు, ఆధ్యాత్మిక కథలు, సరదా ఆటలు నిర్వహించడంతో పాటు భగవద్గీత శ్లోకాల అర్థాలను పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. చిన్నారులు ఎంతో ఆసక్తితో పాల్గొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆనందంగా స్వీకరించారు.క్యాంప్ ద్వారా పిల్లల్లో మంచి అలవాట్లు, క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, ధర్మబద్ధమైన జీవన విధానం వంటి విలువలను పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో శేషయ్య ప్రభు, రాజా ప్రభు, రజ జీవన్ దాస్ ప్రభు, నరేష్ ప్రభు, ఇందిరా మాతాజీ, శాంతి మాతాజీ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












