
గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రెండో పట్టణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రత, చిన్నారుల రక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో శక్తి యాప్ – చిన్నారి తల్లి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ మాల కొండయ్య శక్తి యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐ మాల కొండయ్య మాట్లాడుతూ మహిళల భద్రతకు శక్తి యాప్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక్క క్లిక్‌తో పోలీసుల సహాయం అందుకునేలా ఈ యాప్ రూపొందించబడిందని పేర్కొన్నారు. ప్రతి మహిళ తమ మొబైల్లో ఈ యాప్‌ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మహిళలు, బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని, పోలీసు శాఖ ఎల్లప్పుడూ వారి భద్రత కోసం సిద్ధంగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. చిన్నారుల భద్రతలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని, పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనిస్తూ, వారికి సురక్షిత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని స్పష్టం చేశారు.
ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ శక్తి యాప్ ద్వారా మహిళలకు వేగవంతమైన సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ యాప్‌ను వినియోగించి పోలీసు సేవలను పొందాలని కోరారు. చిన్నారులపై పెరుగుతున్న నేరాల నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలకు శక్తి యాప్ వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పట్టణ సీడీపీవో మెహబూబి, సూపర్వైజర్లు హైమావతి, శివజ్యోతి, జి.ఎం.ఎస్.కె శ్రావ్య, సీ.ఎం.ఎం చందన తదితరులు పాల్గొన్నారు.













