
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరతతో కొన్ని ప్రాంతాల్లో బంకులు మూతపడిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన పరిస్థితిపై జిల్లాల వారీగా వివరాలు సేకరించి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
సీఎస్ సాయిప్రసాద్‌తో పాటు పౌరసరఫరాల శాఖ అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ఇంధన సరఫరా సజావుగా కొనసాగించేలా చూడాలని, అవసరమైతే పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో నేరుగా మాట్లాడాలని సూచించారు.సీఎం ఆదేశాల వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమై స్టాక్ లేని బంకుల వివరాలు సేకరించారు. సరఫరాలో సమస్యలు ఎదుర్కొంటున్న డీలర్లు 1967 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. అదనంగా ఆయిల్ కంపెనీలు 10 శాతం మేర ఇంధనాన్ని అదనంగా సరఫరా చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం.
గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో ఇంధన కొరత స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా డీజిల్ కొరత కారణంగా కొన్ని జిల్లాల్లో బంకులు మూతపడగా, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రబీ పంట కోతల సీజన్ కావడంతో డీజిల్ అందుబాటులో లేక వరి కోత యంత్రాల పనులు అంతరాయం చెందాయి. ఆక్వా రైతులు కూడా ఇంధనం కోసం ఇబ్బందులు పడ్డారు.డీజిల్ దొరికే బంకుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలలో నిలిచిన దృశ్యాలు కనిపించాయి. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోని బంకులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి పరిస్థితులను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి సమీక్ష నిర్వహించడం, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. త్వరలోనే సరఫరా వ్యవస్థను పూర్తిగా సరిచేసి ఇంధన కొరత సమస్యను నివారిస్తామని అధికారులు తెలిపారు.గత నెలలో కూడా వంట గ్యాస్, పెట్రోల్ కొరత తలెత్తిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అప్పట్లో కూడా ప్రభుత్వం వేగంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు కూడా అదే తరహాలో చర్యలు తీసుకుంటూ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.












