ఏపీలో పాస్టర్ల ఎస్సీ కుల ధ్రువపత్రాల రద్దు డిమాండ్.. హైకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్లకు జారీ చేసిన ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. అర్హత లేకపోయినా చర్చిల్లో పనిచేస్తున్న కొంతమంది పాస్టర్లు ఎస్సీ కుల ధ్రువపత్రాలు పొందారని పిటిషన్‌లో ఆరోపించారు.పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పెద్దిరెడ్డి ప్రసన్నకుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆయన షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చిల్లో పనిచేస్తున్న పాస్టర్లకు జారీ చేసిన ఎస్సీ ధ్రువపత్రాలను రద్దు చేయాలని, ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు.సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో చర్చిల్లో పనిచేస్తున్న పాస్టర్లలో పెద్ద సంఖ్యలో వారు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. మతమార్పిడి అనంతరం పాస్టర్లుగా పనిచేస్తున్నవారికి ఎస్సీ హక్కులు వర్తించవని, అయినప్పటికీ వారు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నారని పిటిషన్‌లో ఆరోపించారు.
ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. ఆ తీర్పు ప్రకారం క్రైస్తవ మతంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని, ఈ హక్కులు హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందినవారికే వర్తిస్తాయని పేర్కొన్నారు.ఈ పరిస్థితుల్లో నిజమైన అర్హులకు ప్రభుత్వం అందించే పథకాలు చేరడం లేదని పిటిషనర్ వాదించారు. అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా చర్చిల్లో పాస్టర్లుగా పనిచేస్తున్నవారి ఎస్సీ కుల ధ్రువపత్రాలను రద్దు చేయాలని కోరారు.
ప్రస్తుతం ఈ పిటిషన్‌కు నంబరు కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. అనంతరం విచారణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

error: Content is protected !!
Prajaveek Shanam