గంజాయి రవాణా విక్రేత అరెస్ట్.. భారీ స్వాధీనం

కూడేరు మండలంలో గంజాయి రవాణా, విక్రయానికి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి భారీ మొత్తంలో గంజాయి, కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని కూడేరు మండలంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కూడేరు సీఐ రాజు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ముద్దులాపురం జాతీయ రహదారి వద్ద శివారెడ్డి గార్డెన్ సమీపంలో అనుమానాస్పదంగా వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా తాడిపత్రికి చెందిన గట్టు శివదత్త అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు ఒకన్నర కిలోల గంజాయి, కియా కారు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన ఆస్తి మొత్తం విలువ సుమారు రూ.16 లక్షల 30 వేలుగా అంచనా వేశారు.సీఐ రాజు శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నిందితుడు చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి వ్యాపారం ప్రారంభించినట్లు తెలిపారు. అనంతపురం నుంచి కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి గంజాయిని తరలించి, అక్కడ అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నట్లు దర్యాప్తులో బయటపడిందన్నారు.పోలీసులకు అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.మండలంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీఐ ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

error: Content is protected !!
Prajaveek Shanam