
కనుమరాయకొండ (అలిమిలి): శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జయంతి సందర్భంగా కనుమరాయకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీ గురువారం వైభవంగా జయంతి వేడుకలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, దర్శనం, పొంగళ్ల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 9 గంటలకు స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని ముత్యాల తలంబ్రాలతో, వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఘనంగా జరపనున్నారు.మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు అన్నదానం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు పల్లకీ సేవ నిర్వహించనుండగా, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
సాయంత్రం 6 గంటలకు నెల్లూరు అంజలి డాన్స్ అకాడమీ కళాకారులచే భరతనాట్యం, కూచిపూడి, వెస్ట్రన్ నృత్యాలు ప్రదర్శించనున్నారు. రాత్రి 8 గంటలకు సత్య మీడియా ఆధ్వర్యంలో టీవీ, సినీ కళాకారులచే మ్యూజికల్ ఆర్కెస్ట్రా కార్యక్రమం నిర్వహించనున్నారు.
కావున భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ సభ్యులు బత్తల సుబ్బారెడ్డి కోరారు














