గూడూరు పట్టణంలో ఉద్యోగ మేళా

  • — నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్
  • నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా గూడూరు పట్టణంలోని డీఆర్‌డబ్ల్యూ కళాశాలలో నిర్వహించిన ఉద్యోగ మేళా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్, పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ ఛైర్మన్ తానంకి నానాజీ తో కలిసి పాల్గొని, ఎంపికైన నిరుద్యోగ యువతకు నియామక పత్రాలను అందజేశారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముఖ్యంగా పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ఆహ్వానం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
  • గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ రహదారుల విస్తరణ, తాగునీటి సదుపాయాల మెరుగుదల, విద్యుత్ సరఫరా బలోపేతం, ఆరోగ్య సేవల విస్తరణ వంటి పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
  • అలాగే విద్యా రంగంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పలు సంస్కరణలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పించడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కొత్త విధానాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పెరగాలనే ఉద్దేశంతో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.
  • నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 7 చిన్న ఉద్యోగ మేళాలు, 3 పెద్ద ఉద్యోగ మేళాలు నిర్వహించామని, వాటిలో మొత్తం 1768 మంది హాజరుకాగా, అందులో 1057 మంది నిరుద్యోగ యువత ఉపాధి పొందినట్లు వెల్లడించారు.
  • ఈరోజు నిర్వహించిన ఉద్యోగ మేళాలో దాదాపు 15 సంస్థలు పాల్గొని 900 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. యువత తమ ప్రతిభను నిరూపించుకునే మంచి వేదికగా ఈ ఉద్యోగ మేళాలు నిలుస్తున్నాయని, నిరుద్యోగ యువత అందరూ ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
  • అలాగే విశాఖపట్నంలో ఆధునిక సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీని ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని సాంకేతిక రంగంలో ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
  • కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నిరుద్యోగ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటోందని, భవిష్యత్తులో కూడా గూడూరు నియోజకవర్గంలో మరిన్ని ఉద్యోగ మేళాలు నిర్వహించి యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాలేజ్ ఉపాధ్యాయులు, విద్యార్థులు , తదితరులు పాల్గొన్నారు
error: Content is protected !!
Prajaveek Shanam