వేసవి సెలవుల్లో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి

– గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు


గూడూరు రూరల్ పరిధిలో వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు సూచించారు. ఈ రోజు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ, సెలవుల సమయంలో పిల్లలు ఎక్కువగా బయట తిరిగే అవకాశాలు ఉండటంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమని తెలిపారు.
ప్రత్యేకంగా గ్రామాల్లో నివసించే ప్రజలు ఇతర ఊర్లకు ప్రయాణాలు చేసే సమయంలో పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టకుండా జాగ్రత్త పడాలని సూచించారు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు తప్పనిసరిగా తెలుసుకోవాలని, అపరిచితులతో మాట్లాడకుండా పిల్లలకు ముందుగానే అవగాహన కల్పించాలన్నారు.
వేసవి సెలవుల్లో చెరువులు, కాలువలు, బావుల వద్ద పిల్లలు ఆడుకునే సందర్భాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి ప్రమాదకర ప్రదేశాలకు పిల్లలను ఒంటరిగా వెళ్లనివ్వకూడదని హెచ్చరించారు. అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో మధ్యాహ్న వేళల్లో పిల్లలు బయట తిరగకుండా చూసుకోవాలని, తగినంత నీరు తాగించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఇటీవలి కాలంలో చిన్నారులకు మొబైల్ ఫోన్లు ఇవ్వడం పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని సీఐ కిషోర్ బాబు సూచించారు. అవసరం లేకుండా పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకుండా ఉండాలని, ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా అడల్ట్ కంటెంట్ వంటి అనుచిత విషయాలు కనిపించకుండా సెక్యూరిటీ సెట్టింగ్స్ (పేరెంటల్ కంట్రోల్) ఏర్పాటు చేసి మాత్రమే ఇవ్వాలని తెలిపారు.
గ్రామాల్లో లేదా పట్టణాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, లేదా పిల్లలకు సంబంధించిన ఏదైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించినా వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రుల అప్రమత్తతతోనే పిల్లల భద్రత సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన తెలిపారు.
అదేవిధంగా వేసవి సెలవుల సమయంలో పిల్లలు ఇంటి బయట ఎక్కువ సమయం గడపకుండా, వారి చదువులు, ఆటలు అన్నీ తల్లిదండ్రుల పర్యవేక్షణలో జరిగేలా చూడాలని, అవసరమైతే గ్రామస్థులు పరస్పరం సహకరించి పిల్లల భద్రతపై దృష్టి పెట్టాలని గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు సూచించారు.

    error: Content is protected !!
    Prajaveek Shanam