140వ “మే డే” దినోత్సవ వేడుకలు గూడూరు పట్టణంలో సి.ఐ.టి.యు, సి.పి.ఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకుడు దారా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు.అనంతరం ప్రదర్శన ర్యాలీగా బయలుదేరిన కార్మికులు వివేకానంద రోడ్డు, ముత్యాలపేట, రాజావీధి, కుమ్మరి వీధి, హాస్పిటల్ రోడ్డు మీదుగా టవర్ క్లాక్ సెంటర్ చేరుకొని అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మధ్యలో భవన నిర్మాణ కార్మిక సంఘం భవనం వద్ద, జీఎస్ రాయల్ సెంటర్, మాలవ్యనగర్ సెంటర్లలో కూడా జెండా ఎగురవేశారు.ఈ సందర్భంగా సి.ఐ.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. అజయ్ కుమార్ మాట్లాడుతూ, పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులు, చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం బలహీనపరుస్తోందని విమర్శించారు. కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకువచ్చి కనీస వేతనాలు, 8 గంటల పని విధానం అమలు కాకుండా చేస్తున్నారని ఆరోపించారు. నిత్యావసర ధరల పెరుగుదలతో పేదలు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.దేశ ఆర్థిక విధానాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మారుతున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ హక్కులకు భంగం కలుగుతోందని, కార్మికులు ఏకమై తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.“మే డే” స్ఫూర్తితో కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల పండుగగా జరుపుకునే మేడే విజయవంతంగా జరుగుతోందని తెలిపారు.
అలాగే సి.ఐ.టి.యు ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ స్టాండ్, ఓజిలి ఆటో స్టాండ్, శివాలయం స్టాండ్, ఆదిశంకర స్టాండ్లలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు పట్టణ అధ్యక్షుడు పామంజి మణి, కార్యదర్శి బి.వి. రమణయ్య, సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్, కేవిపిఎస్ నాయకులు అడపాల ప్రసాద్, ఎంబేటి చంద్రయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు గండి కోట మధు, ఆర్. శ్రీనివాసులు, జిలానీ, బి. చంద్రయ్య, మున్సిపల్ వర్కర్స్ నాయకులు మణెమ్మ, వీఆర్ఏ సంఘం నాయకుడు కొల్లపూడి సుబ్బయ్య, అంగన్వాడీ నాయకురాలు ప్రభావతి, ఆశా వర్కర్స్ నాయకురాలు ఉష, ఎల్ఐసీ నాయకుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.













