రికార్డులు లేని 7 వాహనాల స్వాధీనం

గూడూరు పట్టణంలోని జనార్ధన్‌రెడ్డి కాలనీలో ఒన్‌టౌన్ సీఐ శేఖర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న 7 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసి వారి వివరాలను నమోదు చేశారు. వాహనాల రికార్డులను పరిశీలిస్తూ ప్రజలు చట్టాలను గౌరవించి పోలీసులకు సహకరించాలని సూచించారు.
అనంతరం ఆది శంకర కళాశాల విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించుకోవాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఒన్‌టౌన్ సీఐ శేఖర్ బాబు మాట్లాడుతూ యువత సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని అన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి తమ లక్ష్య సాధన కోసం కృషి చేయాలని సూచించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని, హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు.
ప్రజల భద్రత కోసం ఇలాంటి కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ మనోజ్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.













