
ఇకపై గూడూరు పట్టణ కార్యక్రమాలకు సైకిల్‌పైనే హాజరవుతానని ప్రకటన
దేశ ప్రధానమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు స్పందిస్తూ గూడూరు ఎమ్మెల్యే వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
ఇంధన వినియోగాన్ని తగ్గిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిస్తున్న నేపథ్యంలో, తాను కూడా ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇంధనం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన వనరు. పెరుగుతున్న ఇంధన వినియోగం వల్ల ఆర్థిక భారం మాత్రమే కాకుండా పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతోంది. అందుకే ప్రజల్లో అవగాహన పెంచేందుకు, సీఎం చంద్రబాబు ఆదేశాలు మరియు ప్రధాని మోడీ సూచనల మేరకు ఇకపై గూడూరు పట్టణం జరిగే అధికారిక, సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలకు సైకిల్‌పైనే హాజరవుతాను” అని తెలిపారు.
అలాగే యువత, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వీలైనంత వరకు ఇంధనం పొదుపు దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్న దూరాలకు వాహనాల వినియోగాన్ని తగ్గించి సైకిళ్లు, నడక వంటి అలవాట్లను ప్రోత్సహిస్తే ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్థానిక ప్రజలు, యువత, పర్యావరణ ప్రేమికులు అభినందిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ ఇంధన సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు













