
నెల్లూరు జిల్లా గూడూరు అర్బన్ పరిధిలోని గాంధీనగర్‌లో గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు యేసుపాక పెంచలయ్య ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యంకు కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా యేసుపాక పెంచలయ్య మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ పాలనలో దళితులపై తీవ్రమైన దమనకాండ కొనసాగిందని ఆరోపించారు. దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, అన్యాయాలు జరిగినప్పటికీ అప్పటి ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. దళితుల తరఫున ప్రశ్నించిన నాయకులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధింపులకు గురిచేసిన సంఘటనలు రాష్ట్ర ప్రజలకు తెలిసిందేనన్నారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పనిచేసిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఇంటి వద్ద మృతదేహాన్ని పడేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిందన్నారు. అలాంటి ఘటనలో కూడా బాధిత కుటుంబానికి సరైన న్యాయం చేయడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
అలాగే కరోనా సమయంలో మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను నడిరోడ్డుపై అవమానకరంగా హింసించిన ఘటనను ప్రజలు ఇంకామర్చిపోలేదన్నారు. “నా ఎస్సీలు, నా బీసీలు” అంటూ మాటలు చెప్పిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసి వారి అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని యేసుపాక పెంచలయ్య తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దళితులు, గిరిజనులకు సామాజిక న్యాయం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. విద్య, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు, గృహ నిర్మాణం, ఆర్థిక సహాయం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, యువతకు ఉద్యోగ అవకాశాలు వంటి పలు రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు.గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ కూడా నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో దళితులకు మౌలిక వసతులు కల్పించడం, సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు.
రాబోయే రోజుల్లో దళితుల అభివృద్ధి, సామాజిక గౌరవం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, గతంలో జరిగిన అన్యాయాలను ప్రజలు ఎప్పటికీ మరవకూడదని యేసుపాక పెంచలయ్య పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు.













