
యూహెచ్‌సీ డాక్టర్ రేష్మ, ఎన్టీసీపీ కోఆర్డినేటర్ లలిత
గూడూరు :
గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వీధిలో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యులు, ఏఎన్ఎంలు, సిబ్బంది శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ రేష్మా, నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం గూడూరు శాఖ కో ఆర్డినేటర్ లలిత మాట్లాడుతూ ఆదివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం కావడంతో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, ఆర్ఎంఓ ప్రసన్న సూచనలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించామన్నారు. ధూమ, మద్యపాన సేవనంతో కుటుంబాలు ఛిద్రమవుతాయన్నారు. ముఖ్యంగా యువకులు తమ తండ్రులు, సినిమాలలో హీరోలు సిగరెట్, బీడీ, చుట్ట, హాన్స్ వంటివి తీసుకోవడం చూసి అదొక ఫ్యాషన్ గా భావించి అలవాటు చేసుకుంటున్నారని అన్నారు. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధూమపానం, మద్యం సేవించడం వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే మద్యపానం ఆపివేయాలనుకునే వారికి కాళహస్తి, నెల్లూరు ఆస్పత్రులల్లో టోబాకో సెషన్ సెంటర్లలో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పెద్ద మసీదు వీధిలోని అర్బన్ హెల్త్ సెంటర్ నుండి సాధుపేట సెంటర్ వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.












