మేకనూరులో పెన్షన్ పంపిణీ, రూ.87 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారంపలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్

మేకనూరు గ్రామం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహాయ సహకారాలతో గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ తెలిపారు. మేకనూరు గ్రామంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.మేకనూరు గ్రామంలో మొత్తం 423 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, ఇందుకోసం ప్రతి నెల రూ.18 లక్షల 35 వేల రూపాయలు ప్రభుత్వం వ్యయం చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారని చెప్పారు.అనంతరం గ్రామంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద 10 మంది లబ్ధిదారులకు రూ.5.75 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అలాగే గ్రామ అభివృద్ధి కోసం సుమారు రూ.83 లక్షల వ్యయంతో పలు పనులను ప్రారంభించారు.అందులో భాగంగా ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి ఎస్టీ కాలనీ వరకు రూ.30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, రూ.24 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు, రూ.8 లక్షలతో తాగునీటి పైప్‌లైన్ నిర్మాణం వంటి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు.
కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమరేంద్ర, రమేష్, శ్రీనివాసులు గ్రామ ప్రజల తరఫున పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై స్పందించిన ఎమ్మెల్యే, ఆయా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు వివరించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

error: Content is protected !!
Prajaveek Shanam