
నెల్లూరు, జూన్ 4: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తిరిగి బతికిన రోజు ఇదేనని, వైసీపీ అరాచక పాలనకు ప్రజలు ఓటు రూపంలో పోటు పొడిచి రెండేళ్లు పూర్తయ్యాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం, ప్రజాస్వామ్య హక్కుల హననం, పరదాల పాలన, అరాచకాలు కొనసాగాయని విమర్శించిన సోమిరెడ్డి, 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీని 153 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేసి అహంకారానికి గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం నెలకు రూ.2,725 కోట్లు, ఏడాదికి రూ.33 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకం, ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారుల వేట విరామ భృతి పెంపు, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతోందన్నారు.
దేవాలయాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నామని, కసుమూరు దర్గాలో నిత్యాన్నదానం కూడా ప్రారంభించామని చెప్పారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ రికార్డులు అస్తవ్యస్తం అయ్యాయని, రీసర్వే పేరుతో అనేక సమస్యలు సృష్టించారని ఆరోపించారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలు వెలుగులోకి రావాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల మద్దతు కోల్పోయినప్పటికీ వైసీపీ నాయకత్వంలో మార్పు కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ పాలన కొనసాగిస్తామని సోమిరెడ్డి స్పష్టం చేశారు.












