భారీ చోరీ కేసు ఛేదించిన చిత్తూరు పోలీసులు రూ.38 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాల స్వాధీనం.. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

చిత్తూరు, జూన్ 4: చిత్తూరు పట్టణంలోని మిట్టూరు ప్రాంతంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.38 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

మిట్టూరు ప్రాంతానికి చెందిన ఎన్.పి. గౌతమ్ కిరణ్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ పర్యవేక్షణలో, డీఎస్పీ జె. వెంకటనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో విచారణ జరిపారు. దర్యాప్తులో తమిళనాడు రాష్ట్రానికి చెందిన పెరుమాళ్లు కృష్ణ అలియాస్ పి. కృష్ణ (54), అతని కుమారుడు కృష్ణ సంతోష్ కుమార్ (26) ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.

సేకరించిన సమాచారంతో గురువారం చిత్తూరు పట్టణంలోని కట్టమంచి ప్రాంతంలో స్వామి వివేకానంద విగ్రహం సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితుల వద్ద నుంచి రూ.28 లక్షల విలువైన 186 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల విలువైన 3.75 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల విచారణలో నిందితులు తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. వీరిపై కర్ణాటక రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 17 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి ప్రాంతంలో 3 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రజలు అధిక మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను ఇళ్లలో కాకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇంటికి తాళం వేసి వెళ్లే సమయంలో సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS) సేవలను వినియోగించుకోవాలని కోరారు.

ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడి, డీఎస్పీ జె. వెంకటనారాయణ అభినందించి రివార్డులు ప్రకటించారు.

error: Content is protected !!
Prajaveek Shanam