
గూడూరు: గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జి. శశికుమార్, పట్టణ కన్వీనర్ సునీల్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నెలల తరబడి జీతాలు అందక పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో పాటు, పిల్లల విద్యా ఫీజులు చెల్లించలేక కొందరు చదువులు మానేసే పరిస్థితి నెలకొందన్నారు.కార్మికుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాల్సిన మొత్తాలను వెంటనే చెల్లించాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కాంట్రాక్టర్ మారినా ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణి కారణంగానే జీతాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని విమర్శించారు.ఇకపై ప్రతి నెలా జీతాలను సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, పని ఒత్తిడితో బాధపడుతున్న కార్మికులకు కనీస భరోసా కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి జమాలుల్లా, ఏఐవైఎఫ్ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.













