చర్చలు సఫలం.. విధుల్లోకి SEIL కార్మికులుఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రత్యేక చొరవతో కార్మికుల సమస్యలకు పరిష్కారం

SEIL సంస్థ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన ప్రత్యేక చొరవ ఫలించింది. కార్మికుల డిమాండ్లపై అధికారులు, SEIL యాజమాన్య ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులతో నాలుగు రోజుల పాటు నిర్వహించిన చర్చలు విజయవంతం కావడంతో కార్మికులు తిరిగి విధుల్లో చేరారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు అంశాలపై యాజమాన్యంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి అంగీకారం కుదిర్చారు. అటెండెన్స్ అలవెన్స్‌గా రోజుకు రూ.50 అదనంగా చెల్లించేందుకు, హార్డ్‌షిప్ అలవెన్స్‌గా నెలకు రూ.500, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌గా మరో రూ.500 నేరుగా కార్మికులకు అందించేలా యాజమాన్యాన్ని ఒప్పించారు. దీంతో కార్మికులకు నెలకు రూ.4 వేలకుపైగా అదనపు ప్రయోజనం చేకూరనుంది. అలాగే ప్రతి కార్మికుడికి నెలవారీ వేతనంతో పాటు రూ.1,052 బోనస్, రూ.972 లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ప్రయోజనాలను చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. కార్మికులకు అందాల్సిన వేతనాలు, ఇతర ప్రయోజనాల చెల్లింపులో కాంట్రాక్టర్లతో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి మార్గం చూపారు. ఇకపై ప్రతి నెలా కార్మికులకు పేస్లిప్‌లు అందజేయడంతో పాటు, వారికి రావాల్సిన అన్ని అలవెన్సులు కంపెనీ ప్రతినిధుల సమక్షంలో సక్రమంగా అందేలా చర్యలు తీసుకోనున్నారు. అదేవిధంగా ప్రతి కార్మికుడికి వారం రోజుల్లోపు ఈఎస్ఐ కార్డులు అందజేసి, వాటి వినియోగం, ప్రయోజనాలపై అవగాహన కల్పించనున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సహకరించిన అధికారులు, యాజమాన్య ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

error: Content is protected !!
Prajaveek Shanam