గూడూరు పట్టణం గాంధీనగర్‌లో నూతన క్రైస్తవ ప్రార్థనా మందిర ప్రారంభోత్సవం.

ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్


గూడూరు పట్టణం గాంధీనగర్‌లో నూతన క్రైస్తవ ప్రార్థనా మందిర ప్రారంభోత్సవం
గూడూరు, జూన్ 10: గూడూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని గూడూరు శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీ పాశిం సునీల్ కుమార్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రార్థనా మందిర నిర్వాహకులు, క్రైస్తవ పెద్దలు, విశ్వాసులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ, మతాలు వేరు కావచ్చు కానీ మనుషులందరూ ఒక్కటేనని, ప్రతి మనిషిలో ప్రవహించేది ఒకే రక్తమని, పరస్పర ప్రేమ, సహనం, సోదరభావం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో జీవించినప్పుడే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొంటాయని అన్నారు.అలాగే ప్రార్థనా మందిరాల్లో జరిగే కార్యక్రమాల సందర్భంగా స్థానిక ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చర్చిల ప్రసంగాలు, ప్రార్థనల సమయంలో అధిక శబ్దంతో లౌడ్‌స్పీకర్లు వినియోగించకుండా నిబంధనలను పాటించాలని, కొందరు కావాలనే ఫిర్యాదులు చేసే అవకాశాలు ఉన్నందున నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
రాష్ట్రంలోని క్రైస్తవుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు. క్రైస్తవ సంఘాల అభివృద్ధికి, ప్రార్థనా మందిరాల అభివృద్ధికి, పేద క్రైస్తవ కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు.
గూడూరు నియోజకవర్గంలో కూడా క్రైస్తవ సోదరుల అభ్యున్నతి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్ సదుపాయాలు, పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాల అందజేత, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మతాల ప్రజలను సమానంగా ఆదుకుంటూ అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తుంచుకోవాలని, ప్రజల ఆశీస్సులు మరియు సహకారంతోనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రజల పట్ల కృతజ్ఞతాభావంతో మరింత సేవ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కొనసాగాలంటే ప్రజలు మరోసారి కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచి ఆశీర్వదించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో చర్చి నిర్వాహకులు, క్రైస్తవ మత పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam