
కందుకూరు నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై బూత్ స్థాయి ప్రతినిధులకు నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, కందుకూరు నియోజకవర్గ పరిశీలకులు మట్టం శ్రావణి రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మట్టం శ్రావణి రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా అత్యంత కీలకమైనదని అన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో బూత్ స్థాయి ప్రతినిధులు చురుకుగా పాల్గొని అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో నమోదు చేసేలా కృషి చేయాలని సూచించారు.ఓటరు జాబితాలో ఉన్న లోపాలను గుర్తించి సరిదిద్దడం, కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయించడం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా నివాసం మార్చుకున్న వారి పేర్లను తొలగించే ప్రక్రియలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.ఓటరు జాబితా ఖచ్చితత్వం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో అవసరమని పేర్కొన్న ఆమె, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరు నమోదు ప్రక్రియ సక్రమంగా జరిగేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.అనంతరం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అమలు విధానం, దరఖాస్తుల స్వీకరణ, అభ్యంతరాల నమోదు తదితర అంశాలపై బూత్ స్థాయి ప్రతినిధులకు అవగాహన కల్పించారు.













