మున్సిపల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ధర్నా

మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణను ఉపసంహరించాలి: సీఐటీయూ డిమాండ్

గూడూరు, జూన్ 11: మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణ చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని, మున్సిపల్ కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం గూడూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు నిరసన ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖలోని 14 కీలక విభాగాలను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ప్రైవేటీకరించాలని నిర్ణయించడం కార్మికుల ప్రయోజనాలకు, ప్రజా సంక్షేమానికి విరుద్ధమని విమర్శించారు. మున్సిపాలిటీల్లో ఉన్న లోపాలను సరిదిద్ది ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన ప్రభుత్వం, బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం సరికాదన్నారు.ఎండలు, వానలు, వరదలు, తుఫానులు, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజారోగ్యం, పారిశుధ్య పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికుల భవిష్యత్తు ప్రైవేటీకరణతో ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచే అవకాశముందని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించి ప్రజా, కార్మిక అనుకూల విధానాన్ని అవలంబించాలని కోరుతూ గూడూరు ఇన్‌చార్జి కమిషనర్ డి. సోమశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ధారా కోటేశ్వరరావు, గూడూరు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి బి.వి. రమణయ్య, మున్సిపల్ సంఘం సహాయ కార్యదర్శి జి. మణి, భూలోక మురళి, బి. అనిల్, ఎస్. సుబ్రహ్మణ్యం, ఆర్. ఆనంద్, జి. మేరీ, పి.బి. పెంచలమ్మ, కె. పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam