కెనరా బ్యాంకు నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం పొదుపు మహిళలను ఇబ్బందులకు గురిచేస్తే ఆందోళన తప్పదు: తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ హెచ్చరిక

మేనేజర్, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం – బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయిస్తామని హెచ్చరిక

గూడూరు కెనరా బ్యాంకు సిబ్బంది, ముఖ్యంగా బ్యాంకు మేనేజర్ మరియు సంబంధిత అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా పొదుపు మహిళలు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ మండిపడ్డారు. బ్యాంకు ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆయన మాట్లాడుతూ మాలవ్యనగర్‌కు చెందిన మహిళలు దాదాపు పది సంవత్సరాలుగా “ఆదర్శ పొదుపు లక్ష్మి గ్రూపు” పేరిట పొదుపు సంఘాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. 2023 ఫిబ్రవరిలో తీసుకున్న రుణాన్ని 2026 ఏప్రిల్ నాటికి పూర్తిగా చెల్లించిన అనంతరం, గ్రూపులోని సభ్యులు పరస్పర అంగీకారంతో సంఘాన్ని రద్దు చేసుకుని పొదుపు నిధులను సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.అందుకు సంబంధించిన తీర్మాన పత్రాలను మెప్మా అధికారుల ధృవీకరణతో సుమారు 45 రోజుల క్రితమే కెనరా బ్యాంకుకు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపు నాయకులు, సభ్యులు వారానికి పలుమార్లు బ్యాంకుకు వెళ్లి అధికారులను కలిసినా సరైన సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.45 డిగ్రీల తీవ్ర ఎండల్లో మహిళలు మాలవ్యనగర్ నుంచి బ్యాంకుకు తిరుగుతున్నా, వారి సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి బ్యాంకు అధికారుల్లో కనిపించడం లేదన్నారు. ఈ విషయాన్ని మెప్మా మోటివేటర్, కమ్యూనిటీ ఆర్గనైజర్ దృష్టికి తీసుకెళ్లినా, వారు బ్యాంకు అధికారులను సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాధానం రాలేదని తెలిపారు.ఒక పొదుపు సంఘం ఖాతాను మూసివేసి సభ్యుల సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయడానికి నెలన్నర కాలం పట్టడం ఏమిటని ప్రశ్నించారు. మహిళల కష్టార్జిత పొదుపు సొమ్ము విషయంలో బ్యాంకు అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండనీయమన్నారు.ఇప్పటికైనా కెనరా బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత మేనేజర్, అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆదర్శ పొదుపు లక్ష్మి గ్రూపు ఖాతాను మూసివేసి సభ్యుల పొదుపు సొమ్మును వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.రాబోయే 48 గంటల్లో సమస్యను పరిష్కరించకపోతే బ్యాంకు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయిస్తామని, అవసరమైతే బాధిత మహిళలతో కలిసి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ తీవ్ర హెచ్చరిక చేశారు. మహిళల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తే సహించబోమని స్పష్టం చేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam