
గూడూరు, జూన్ 11: గూడూరు పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో 2 టౌన్ సీఐ మాల కొండయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలు, ఆటోరిక్షాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ), ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ తదితర పత్రాలు ఉన్నాయా లేదా అనే అంశాలను తనిఖీ చేశారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా హెల్మెట్ తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా సీఐ మాల కొండయ్య మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు తన వాహనానికి సంబంధించిన అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించడం (ట్రిపుల్ రైడింగ్) చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే ద్విచక్ర వాహనదారులు తాము మాత్రమే కాకుండా తమ కుటుంబ సభ్యుల భద్రత కోసం కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఆటోరిక్షాల తనిఖీల సందర్భంగా అధిక లోడుతో ప్రయాణికులను తీసుకెళ్లడం ప్రమాదకరమని సీఐ తెలిపారు. ఆటోల్లో నిర్ణీత పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆటో డ్రైవర్లకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆటో డ్రైవర్లపై మోటార్ వెహికల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ క్రమశిక్షణ పెంపు మరియు ప్రజల భద్రతే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని సీఐ మాల కొండయ్య తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదరహిత సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ఆయన కోరారు.














