
చిలకలూరిపేట, జూన్ 11: అక్రమ సంబంధం కారణంగా ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసును చిలకలూరిపేట రూరల్ పోలీసులు ఛేదించి, నిందితులైన భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ వి. హనుమంతరావు వెల్లడించారు.పోలీసుల కథనం ప్రకారం, చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన షేక్ జాకీర్ హుస్సేన్ (45) టింకరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో చిలకలూరిపేట పట్టణానికి చెందిన షేక్ కాలేషా భార్య మనీషాతో అతనికి అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న కాలేషా తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో దంపతులు తమ సొంత ఇల్లు వదిలి రెడ్లబజార్ ప్రాంతంలోని అద్దె ఇంటికి మారినప్పటికీ, జాకీర్ హుస్సేన్‌తో మనీషా సంబంధం కొనసాగింది.దీంతో ఆగ్రహానికి గురైన కాలేషా, జాకీర్ హుస్సేన్ వల్ల తమ కుటుంబ జీవితం నాశనమవుతోందని భావించి అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయమై భార్య మనీషాను ఒప్పించగా ఆమె కూడా అంగీకరించింది. పథకం ప్రకారం ఈ నెల 1వ తేదీన మనీషా తన ఫోన్ ద్వారా జాకీర్ హుస్సేన్‌ను పిలిపించింది. అనంతరం భార్యాభర్తలిద్దరూ కలిసి అతడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో పాటు తాడుతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.హత్య అనంతరం నేరాన్ని దాచిపెట్టేందుకు మృతదేహాన్ని వేలూరు – జాలాది రహదారి పక్కన పడవేసి అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి రోజు మృతదేహాన్ని గుర్తించిన మృతుడి భార్య షేక్ షఫియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు, నరసరావుపేట డీఎస్పీ పర్యవేక్షణలో చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు, ఎస్ఐ జి. అనిల్ కుమార్ మరియు పోలీసు బృందం దర్యాప్తు చేపట్టింది. ఎటువంటి ప్రత్యక్ష ఆధారాలు లేని ఈ కేసును సాంకేతిక ఆధారాలు, సెల్‌ఫోన్ డేటా, ఇతర సమాచారాన్ని విశ్లేషించి పోలీసులు ఛేదించారు.
దర్యాప్తులో నిందితుల ప్రమేయం నిర్ధారణ కావడంతో గురువారం మధ్యాహ్నం చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెం గ్రామ పరిధిలో షేక్ కాలేషా అలియాస్ కాలేషా వలి (35), షేక్ మనీషా (31)లను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రక్తపు మరకలు ఉన్న చెక్క, తాడు, సెల్ఫోన్లు, మృతుడిని తరలించేందుకు ఉపయోగించిన టాటా ఏస్ వాహనం, మృతుడికి చెందిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.క్లిష్టమైన ఈ హత్య కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు, ఎస్ఐ జి. అనిల్ కుమార్ మరియు పోలీసు సిబ్బందిని పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు.












