ఏఐ మోజులో విద్యార్థుల భవిష్యత్తు.. మేల్కొనాల్సిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు!

నేటి ప్రపంచం సాంకేతిక విప్లవం దిశగా వేగంగా దూసుకుపోతోంది. కృత్రిమ మేధ (ఏ ఐ), స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ వంటి ఆధునిక సాంకేతిక సాధనాలు మన జీవితాన్ని సులభతరం చేస్తున్నాయి. విద్యా రంగంలో కూడా ఇవి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. కానీ ప్రతి నాణానికి రెండు వైపులున్నట్లే, ఈ సాంకేతికత కూడా సరైన పద్ధతిలో ఉపయోగిస్తే వరం, తప్పుగా ఉపయోగిస్తే శాపంగా మారుతోంది.నేడు వేలాది రూపాయలు ఫీజులు కట్టి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్న తల్లిదండ్రులు తమ పిల్లలు అత్యుత్తమ విద్యను పొందుతున్నారని భావిస్తున్నారు. పాఠశాలలు కూడా ఆధునిక విద్య, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, స్మార్ట్ లెర్నింగ్ పేరుతో భారీ ప్రచారం చేస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి? పిల్లలు నిజంగా చదువుతున్నారా? లేక కేవలం మార్కుల కోసం ఒక నాటకం నడుస్తోందా? అనే ప్రశ్న ప్రతి తల్లిదండ్రి, ప్రతి ఉపాధ్యాయుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం అనేక మంది విద్యార్థులు హోంవర్క్‌లు, అసైన్‌మెంట్‌లు, ప్రాజెక్ట్ పనులు చేయడానికి ఏఐ యాప్‌లపై పూర్తిగా ఆధారపడుతున్నారు. ఒకప్పుడు హోంవర్క్ అంటే విద్యార్థి పుస్తకాలు తెరిచి చదివేవాడు. విషయాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించేవాడు. తప్పులు చేసేవాడు. ఆ తప్పులను సరిదిద్దుకుంటూ నేర్చుకునేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ప్రశ్నను ఏఐ యాప్‌లో టైప్ చేస్తే క్షణాల్లో సమాధానం సిద్ధంగా వస్తోంది. ఆ సమాధానాన్ని యథాతథంగా నోట్‌బుక్‌లో రాసి మరుసటి రోజు పాఠశాలకు తీసుకెళ్తున్నారు. ఉపాధ్యాయులు నోట్‌బుక్ చూసి “చాలా బాగా రాశావు”, “అద్భుతం” అని ప్రశంసిస్తున్నారు. కానీ ఆ సమాధానం రాసిన విద్యార్థికి నిజంగా ఆ విషయం అర్థమైందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం ఎంతమంది చేస్తున్నారు?ఇది విద్య కాదు. ఇది ఒక రకంగా విద్యా వ్యవస్థను మోసం చేయడమే.
నేడు చాలా మంది విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తున్నారు. కానీ ఆ మార్కుల వెనుక ఉన్న నిజమైన జ్ఞానం ఎంత? ఒక పాఠాన్ని అర్థం చేసుకుని స్వయంగా వివరణ ఇవ్వగలిగే విద్యార్థులు ఎంతమంది? ఒక చిన్న ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి ఎందుకు వస్తోంది? కారణం ఒక్కటే – ఆలోచనా శక్తి తగ్గిపోవడం.ఏఐ ద్వారా సమాధానం పొందడం తప్పు కాదు. కానీ దాన్ని అర్థం చేసుకోకుండా కేవలం కాపీ చేసి రాయడం ప్రమాదకరం. ఎందుకంటే విద్య అనేది జవాబు రాయడంలో లేదు. ఆ జవాబు వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది.ఇక తల్లిదండ్రుల పాత్ర కూడా ప్రశ్నార్థకంగానే మారుతోంది. నేటి బిజీ జీవితంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చేతికి మొబైల్ ఫోన్ ఇచ్చి తమ బాధ్యత పూర్తయిందని భావిస్తున్నారు. పిల్లలు ఫోన్‌లో చదువుకుంటున్నారని అనుకుంటున్నారు. కానీ వారు నిజంగా ఏమి చేస్తున్నారు? ఎంతసేపు సోషల్ మీడియా చూస్తున్నారు? ఎంతసేపు గేమ్స్ ఆడుతున్నారు? ఎంతసేపు వీడియోలు చూస్తున్నారు? అనే విషయాలను గమనించడం లేదు.పిల్లలు చదువు పేరుతో మొబైల్ తీసుకుని గంటల తరబడి ఇతర విషయాల్లో గడుపుతున్నారు. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులకు అసలు వాస్తవం తెలియదు. దీంతో చిన్న వయసులోనే మొబైల్ వ్యసనం పెరుగుతోంది. పుస్తకాలతో గడపాల్సిన సమయం స్క్రీన్‌లతో గడుస్తోంది.ఒకప్పుడు పిల్లలు కథల పుస్తకాలు చదివేవారు. నిఘంటువులు తిరగేసేవారు. సందేహాలు వస్తే ఉపాధ్యాయులను అడిగేవారు. ఇప్పుడు ఏ ప్రశ్న వచ్చినా గూగుల్, ఏ ఐ, యూట్యూబ్ వైపు పరుగులు తీస్తున్నారు. సమాచారం సులభంగా దొరుకుతోంది. కానీ ఆ సమాచారాన్ని విశ్లేషించే సామర్థ్యం తగ్గిపోతోంది.ఇది కేవలం చదువుపైనే కాదు, పిల్లల వ్యక్తిత్వ వికాసంపైనా ప్రభావం చూపుతోంది. మొబైల్ వినియోగం పెరగడంతో ఏకాగ్రత తగ్గిపోతోంది. జ్ఞాపకశక్తి బలహీనపడుతోంది. పుస్తక పఠన అలవాటు కనుమరుగవుతోంది. శారీరక ఆటలు తగ్గిపోతున్నాయి. స్నేహితులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశాలు తగ్గుతున్నాయి. ఫలితంగా పిల్లలు ఒంటరితనం, ఆందోళన, మానసిక ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చింది. విద్యార్థి నోట్‌బుక్‌లో ఎంత బాగా రాశాడన్నది కాదు, అతనికి విషయం ఎంత అర్థమైందన్నది ముఖ్యం. హోంవర్క్ పూర్తయిందా లేదా అనేది కాదు, నేర్చుకున్నాడా లేదా అనేదే అసలు ప్రమాణం కావాలి. విద్యార్థులను ప్రశ్నించాలి. చర్చల్లో పాల్గొనించేలా చేయాలి. వారి ఆలోచనా శక్తిని పరీక్షించాలి.అదే విధంగా తల్లిదండ్రులు కూడా ఫీజులు కట్టడం వరకే తమ బాధ్యత అని భావించకూడదు. పిల్లలతో రోజూ మాట్లాడాలి. వారు ఏమినేర్చుకుంటున్నారు? ఎలా నేర్చుకుంటున్నారు? అనే విషయాలను తెలుసుకోవాలి. మొబైల్ వినియోగానికి సమయ పరిమితులు పెట్టాలి. పుస్తకాలు చదివే అలవాటు పెంచాలి. కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని పెంచాలి.ఏఐ ఒక గొప్ప సాధనం. కానీ అది విద్యార్థి మెదడుకు ప్రత్యామ్నాయం కాదు. అది ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కాదు. అది కష్టపడి చదివే అలవాటుకు ప్రత్యామ్నాయం అసలు కాదు.ఏ ఐ ద్వారా సమాధానం దొరుకుతుంది. కానీ జ్ఞానం దొరకదు. మొబైల్ ద్వారా సమాచారం దొరుకుతుంది. కానీ విజ్ఞానం దొరకదు. గూగుల్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలదు. కానీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పలేదు.నేడు ఏ ఐ పై పూర్తిగా ఆధారపడే విద్యార్థి రేపు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వయంగా పరిష్కరించలేకపోవచ్చు. ఎందుకంటే పరీక్షల్లో ఏ ఐ సహాయం చేయొచ్చు. కానీ జీవిత పరీక్షలో ప్రతి ఒక్కరూ తమ సొంత ఆలోచనా శక్తిపైనే ఆధారపడాలి.అందుకే ఇప్పటికైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మేల్కొనాలి. సాంకేతికతను ఉపయోగించాలి కానీ దానికి బానిసలు కాకూడదు. ఏఐని ఒక సహాయక సాధనంగా మాత్రమే చూడాలి. చదువుకు ప్రత్యామ్నాయంగా కాదు.లేకపోతే రాబోయే రోజుల్లో పాఠశాలలు ఉంటాయి… స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు ఉంటాయి… ఏ ఐ యాప్‌లు ఉంటాయి… మార్కులు ఉంటాయి… సర్టిఫికెట్లు ఉంటాయి… కానీ నిజమైన జ్ఞానం, స్వతంత్ర ఆలోచన, సృజనాత్మకత, విలువలు మాత్రం కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.అది కేవలం ఒక విద్యార్థి నష్టం కాదు. ఒక కుటుంబం నష్టం కాదు. ఒక సమాజం, ఒక దేశం భవిష్యత్తుకు తీరని నష్టం.ఇప్పటికైనా ఆలోచిద్దాం… పిల్లలకు మొబైల్ ఇవ్వడానికి ముందు, ఏ ఐ ఉపయోగించడానికి ముందు, వారి భవిష్యత్తు గురించి ఒక్కసారి గంభీరంగా ఆలోచిద్దాం.

error: Content is protected !!
Prajaveek Shanam