
ఖమ్మం: ఖమ్మం నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులకు ఎలుకల మందు కలిపిన ఆహారం తినిపించగా, చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, లింగరాజు–స్వాతి దంపతులు గత రెండు సంవత్సరాలుగా ఖమ్మం నగరంలోని పంపింగ్ వెల్ రోడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఆరు సంవత్సరాలు, ఐదు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి స్వగ్రామం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు గ్రామం.ఇటీవల స్వగ్రామమైన గుర్రాలపాడుకు వెళ్లి నివసించాలని భర్త లింగరాజు సూచించడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భర్త ఇంటి బయటకు వెళ్లిన సమయంలో స్వాతి తన ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు కలిపిన ఆహారం తినిపించినట్లు సమాచారం.అస్వస్థతకు గురైన చిన్నారులను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది.












