తల్లికి వందనం నిధులు విద్యార్థుల అవసరాలకే వినియోగించాలి

– తల్లిదండ్రుల్లో మరింత అవగాహన పెరగాలి

– సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విద్యా సంస్కరణలకు ఎనలేని కృషి

– గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ

(గూడూరు), జూన్ 23:

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల హాజరు పెంపు, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం లక్షలాది కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎండీ అబ్దుల్ రహీమ్, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు ఏసుపాకు పెంచలయ్య పేర్కొన్నారు.స్థానిక మీడియాతో వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అందులో “తల్లికి వందనం” పథకం అత్యంత కీలకమైనదిగా నిలిచిందని తెలిపారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ విద్య, సాంకేతిక ఆధారిత బోధన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.అదేవిధంగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి ప్రభుత్వ పథకం అర్హులైన ప్రతి విద్యార్థికి చేరేలా నిరంతరం కృషి చేస్తున్నారని, విద్యాభివృద్ధికి ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న “తల్లికి వందనం” నిధులు విద్యార్థుల యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, చెప్పులు, స్టేషనరీ సామగ్రి, డిజిటల్ విద్యా అవసరాలు వంటి వాటి కోసం వినియోగించాల్సి ఉండగా, కొన్ని కుటుంబాల్లో ఈ నిధులు ఇంటి ఖర్చులు, అప్పుల చెల్లింపులు మరియు ఇతర అవసరాలకు మళ్లుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.దీని కారణంగా కొంతమంది విద్యార్థులు ఇప్పటికీ పాత బ్యాగులు, చిరిగిన యూనిఫాంలతో పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. మరికొందరికి నోట్‌బుక్స్, పెన్నులు వంటి కనీస విద్యా సామగ్రి కూడా అందడం లేదని తెలిపారు. ప్రభుత్వం అందించే ప్రతి రూపాయి పిల్లల విద్యకు వినియోగించినప్పుడే పథకం అసలు లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేశారు.పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ, ఇంటి ఖర్చులు ఎప్పటికీ ఉంటాయని, కానీ విద్యలో జరిగిన లోటు పిల్లల జీవితాంతం ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. అందువల్ల తల్లికి వందనం నిధులు అందిన వెంటనే ముందుగా పిల్లలకు అవసరమైన విద్యా సామగ్రిని కొనుగోలు చేయాలని, అనంతరం మిగిలిన మొత్తాన్ని ఇతర అవసరాలకు వినియోగించాలని సూచించారు.గ్రామ, వార్డు సచివాలయాలు, పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రుల కమిటీలు ఈ అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. విద్యార్థుల విద్య కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మాత్రమే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.”ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతో దూరదృష్టితో ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి. పిల్లల చదువుపై పెట్టే ప్రతి రూపాయి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. తల్లికి వందనం నిధులు నిజంగా విద్యార్థుల విద్యకే ఖర్చు అయినప్పుడే ఈ పథకం పూర్తి స్థాయిలో విజయవంతమవుతుంది” అని వారు పేర్కొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam