
డక్కిలి: తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్–4.0 కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల విజయానికి ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమిష్టి కృషి ఎంతో అవసరమన్నారు. తల్లిదండ్రులు ప్రతిరోజూ కొంత సమయం పిల్లల చదువుపై కేటాయించి వారిని ప్రోత్సహించాలని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ వంటి సంక్షేమ పథకాలు విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో చేపడుతున్న విద్యా సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, సాంకేతిక విద్య విస్తరణ, మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ వంటి కార్యక్రమాలు విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల విద్యాశాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.












