జర్నలిస్టుపై సీఐ అనుచిత వ్యాఖ్యలు.. గూడూరులో మీడియా సంఘాల ఆందోళన


రూరల్ సీఐ క్షమాపణ చెప్పాలని డిమాండ్ – లేకపోతే ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక


గూడూరు, ఆగస్టు 2:
గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సతీష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గూడూరు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం టవర్ క్లాక్ సెంటర్‌లో జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు.
కోట నార్త్ గిరిజన కాలనీలో మహిళపై జరిగిన పెట్రోల్ దాడి ఘటనలో గూడూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి సతీష్  వివరణ  అడిగి వార్త ప్రసారం చేసిన నేపథ్యంలో సీఐ అనుచితంగా మాట్లాడారని జర్నలిస్టులు ఆరోపించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం జర్నలిస్టులకు భావప్రకటన స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. వార్తల సేకరణలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న విలేకరులపై అసభ్య పదజాలంతో వ్యాఖ్యానించడం సమంజసం కాదని అన్నారు.
ఆందోళనలో పాల్గొన్న జర్నలిస్టులు “సీఐ డౌన్ డౌన్”, “We Want Justice”, “రూరల్ సీఐ క్షమాపణ చెప్పాలి”, “జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేశారు.రూరల్ సీఐ కిషోర్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గూడూరు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam