రూ.67,452 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

తమిళనాడుకు భారీ పారిశ్రామిక ఊతం
చెన్నైలో వెట్రి తమిళనాడు ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహణ
97 అవగాహన ఒప్పందాలతో లక్షకు పైగా ఉద్యోగాల సృష్టికి మార్గం
పలు పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

చెన్నై, ఆగస్టు 13

తమిళనాడులో పారిశ్రామిక అభివృద్ధికి మరింత వేగం చేకూర్చేలా చెన్నైలో నిర్వహించిన వెట్రి తమిళనాడు ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భారీ పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ సమక్షంలో పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో మొత్తం రూ.67,452 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 97 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 1,06,998 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పెట్టుబడుల ఒప్పందాలతో పాటు పలు కీలక పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా జరిగాయి. మొత్తం రూ.4,476 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఎనిమిది ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా మరో 5,074 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడనున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల విస్తరణకు ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయని ప్రభుత్వం పేర్కొంది.
అదేవిధంగా ఇప్పటికే పూర్తయిన ఐదు పారిశ్రామిక ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ.2,676 కోట్ల పెట్టుబడులతో అమలైన ఈ ప్రాజెక్టుల ద్వారా 1,550 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. పరిశ్రమల విస్తరణతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సిప్కాట్, టిడ్కో, తమిళనాడు పేపర్ మిల్స్, తమిళనాడు ఇండస్ట్రియల్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు పూర్తి చేసిన రూ.777.74 కోట్ల విలువైన 15 అభివృద్ధి పనులను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పనులు రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి మరింత బలం చేకూర్చనున్నాయని అధికారులు తెలిపారు.
సదస్సు సందర్భంగా వివిధ రంగాలకు చెందిన సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను ప్రశంసించారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు తమిళనాడును పెట్టుబడిదారుల ప్రధాన గమ్యస్థానంగా మార్చాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు అన్ని విధాలా సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొమ్మిది సంస్థల్లో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన 20 మందికి ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. పెట్టుబడులు, ఉపాధి, పారిశ్రామిక విస్తరణకు ప్రాధాన్యత ఇస్తూ తమిళనాడును దేశంలో అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam