ఇన్‌స్పైర్-ఎస్‌హెచ్‌ఈ పథకం కొనసాగుతోంది

పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు పునర్వ్యవస్థీకరణ
విదేశాల్లో శాస్త్రీయ పరిశోధనలకు విద్యార్థులకు ప్రోత్సాహం
పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 13  ఉన్నత విద్యలో శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మక ‘ఇన్‌స్పైర్-ఎస్‌హెచ్‌ఈ’ (స్కాలర్‌షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్) పథకాన్ని నిలిపివేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం అమలును మరింత సమర్థవంతంగా మార్చడం, లక్ష్యాలను బలోపేతం చేయడం, విజ్ఞాన శాస్త్ర విద్య మరియు పరిశోధన రంగాల్లో వస్తున్న కొత్త అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం కోసం ప్రస్తుతం పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానంగా వెల్లడించింది. దేశంలో విజ్ఞాన శాస్త్రాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడం, పరిశోధన రంగంలో కొత్త అవకాశాలు కల్పించడం ఇన్‌స్పైర్-ఎస్‌హెచ్‌ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యలో పరిశోధనలకు ఆకర్షితులవుతున్నారని తెలిపింది. పథకాన్ని మరింత ఫలవంతంగా అమలు చేసేందుకు మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు వివరించింది.శాస్త్రీయ పరిశోధనల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం వివిధ స్కాలర్‌షిప్ పథకాల ద్వారా సహకారం అందిస్తోందని పేర్కొంది. విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలోని ఇన్‌స్పైర్-ఎస్‌హెచ్‌ఈ మెంటర్‌షిప్ గ్రాంట్ ద్వారా ఇప్పటివరకు 271 మంది విద్యార్థులు విదేశాల్లో వేసవి కాల పరిశోధన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా యువ పరిశోధకులకు అంతర్జాతీయ స్థాయి అనుభవం లభిస్తోందని తెలిపింది. అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక శాఖ మరియు ఇండో-యూఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం సంయుక్తంగా అమలు చేస్తున్న ‘వాటర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్’ ఫెలోషిప్ కూడా యువ పరిశోధకులకు కీలక అవకాశాలు కల్పిస్తోందని పేర్కొంది. ఈ కార్యక్రమం ద్వారా అమెరికాలోని ప్రముఖ విద్యాసంస్థల్లో నీటి వనరులపై అధునాతన పరిశోధనలు చేపట్టే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు రెండు దశల్లో 63 మంది పరిశోధకులు ఈ ఫెలోషిప్ ద్వారా లబ్ధి పొందినట్లు వెల్లడించింది.
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న జాతీయ విదేశీ స్కాలర్‌షిప్ పథకం ద్వారా కూడా విద్యార్థులకు విదేశీ విద్యలో సహాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా దివ్యాంగులకు ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతోందని పేర్కొంది. గత ఐదేళ్లలో 55 మంది లబ్ధిదారులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ చదువులు కొనసాగించినట్లు వివరించింది. విజ్ఞాన శాస్త్ర పరిశోధనల రంగంలో భారత యువతను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. దేశంలో పరిశోధన సంస్కృతిని బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ విద్యార్థుల ప్రతిభను చాటే అవకాశాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇన్‌స్పైర్-ఎస్‌హెచ్‌ఈ పథకం పునర్వ్యవస్థీకరణ అనంతరం మరింత సమర్థవంతంగా అమలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam