
తుపాకీ ఫొటోతో పోలీసులకు సమాచారం
ఆయుధాల కోసం వెళ్లిన అధికారులకు షాక్
ఇంట్లో నగదు సంచులు స్వాధీనం
డబ్బు మూలాలపై దర్యాప్తు ముమ్మరం
సాగర్, ఆగస్టు 17 (ప్రజా వీక్షణం ):
సామాజిక మాధ్యమాల్లో తుపాకీ పట్టుకుని దిగిన ఫొటోను ఓ యువకుడు పంచుకోవడంతో ప్రారంభమైన అనుమానం చివరకు కోట్ల రూపాయల నగదు స్వాధీనానికి దారితీసింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆటో డ్రైవర్ ఇంట్లో మారణాయుధాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా, ఆయుధాలు కాకుండా భారీ మొత్తంలో నగదు బయటపడింది. సాగర్ జిల్లా గోపాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న రాజేశ్ అహిర్వార్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతని కుమారుడు సౌరభ్ అహిర్వార్ తుపాకీతో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఆ ఫొటో వేగంగా వైరల్ కావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అతని వద్ద అక్రమ ఆయుధాలు ఉన్నాయనే ప్రచారం విస్తరించడంతో పలువురు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితుడి ఇంటికి చేరుకుని క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. ఇంటి ప్రతి మూలను పరిశీలించినప్పటికీ ఎలాంటి తుపాకులు లేదా ఇతర ఆయుధాలు లభించలేదు. అయితే సోదాల సమయంలో పెద్ద మొత్తంలో నగదు సంచులు కనిపించడంతో అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు కనిపించడంతో పోలీసులు నగదు లెక్కించే యంత్రాలను తెప్పించారు. సుమారు ఐదు గంటలపాటు సాగిన లెక్కింపులో మొత్తం నగదు విలువ రూ.3 కోట్లుగా తేలింది. అనంతరం ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని సంబంధిత పత్రాలను పరిశీలించడం ప్రారంభించారు.
నగదు మూలాలపై ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు. అయితే ఆ డబ్బుతో తమకు ఎలాంటి సంబంధం లేదని వారు తెలిపారు. భోపాల్‌లో ప్రభుత్వ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తమ బంధువుకు చెందిన నగదేనని, తాము కేవలం ఇంట్లో ఉంచినట్లు మాత్రమే పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నగదు అసలు యజమాని ఎవరు, అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇంట్లో ఎందుకు ఉంచారు, దానికి సంబంధించిన చట్టబద్ధ ఆధారాలు ఉన్నాయా అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. తుపాకీ ఫొటో కారణంగా మొదలైన దర్యాప్తు కోట్ల రూపాయల నగదు బయటపడటంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.












