సర్వేయర్‌పై చర్యలు తీసుకోవాలి

సీపీఐ నాయకుల డిమాండ్

గూడూరు: ప్రజా వీక్షణం  ఆగస్టు 19 గూడూరు మండలంలో భూ సర్వే, రెవెన్యూ రికార్డుల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మండల సర్వేయర్ విశ్వనాధంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గూడూరు సబ్‌ కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఐ సీనియర్ నాయకులు సి.వి.ఆర్. కుమార్ మాట్లాడుతూ.. పడమర గూడూరు పరిధిలోని సర్వే నంబర్ 520A1B సబ్‌ డివిజన్‌కు సంబంధించి జీ.లైన్, ఎఫ్‌.లైన్ కొలతల్లో మార్పులు చేసి రికార్డుల్లో తేడాలు సృష్టించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.సర్వే నంబర్ 520A1Bకు సంబంధించి ఎఫ్‌.ఎం.బి. రికార్డుల్లో భూమి విస్తీర్ణంలో తేడాలు నమోదయ్యాయని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. 2.66 ఎకరాల భూమిని 2.67 ఎకరాలుగా నమోదు చేసినట్లు ఆరోపించారు. అలాగే మరో భూమికి సంబంధించిన విస్తీర్ణంలోనూ మార్పులు జరిగాయని, 90 సెంట్ల భూమిని 0.87గా రికార్డుల్లో నమోదు చేసినట్లు తెలిపారు.సబ్‌ డివిజన్‌ ప్రక్రియలో 1-B, అడంగల్ తదితర రికార్డులను పూర్తిగా పరిశీలించాల్సి ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయని నాయకులు తెలిపారు. రికార్డుల మార్పులపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టి, ఆరోపణలు రుజువైతే బాధ్యులపై క్రిమినల్ కేసులతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జి. శశికుమార్, పట్టణ కన్వీనర్ సునీల్ మాట్లాడుతూ.. భూ రికార్డుల విషయంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం సబ్‌ కలెక్టర్ అరుణకుమారిని కలిసి సీపీఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నారాయణ, చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam