
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
స్థానిక నాయకులతో మంత్రి సమావేశం
సభా ప్రాంగణాలను పరిశీలించిన బృందం
అనకాపల్లి, ఆగస్టు 21 (ప్రజా వీక్షణం ): రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని కె.కోటపాడు మండలంలో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో మంత్రి సమన్వయ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, ప్రజల భాగస్వామ్యం, కార్యక్రమ నిర్వహణపై చర్చించారు. ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేసి కార్యక్రమ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి రాకపోకలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే కేడర్ సమావేశం నిర్వహించనున్న ప్రాంగణం, ప్రధాన సభా వేదికను కూడా పరిశీలించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీరు, పార్కింగ్, రవాణా, ఇతర సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా పరిశీలకుడు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి, కార్పొరేషన్ ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సూచనలు చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధి, పరిశుభ్రత లక్ష్యాలకు ప్రతీకగా నిలుస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యక్రమాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.












