రీఎంట్రీలో హెన్రిక్స్ విధ్వంసం

ఫిన్లాండ్, ఆగస్టు 21 (ప్రజా వీక్షణం ): ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన వెంటనే అదరగొట్టాడు. 39 ఏళ్ల వయసులో పోర్చుగల్ తరఫున బరిలోకి దిగిన హెన్రిక్స్.. టీ20 ప్రపంచకప్ యూరప్ సబ్‌రీజనల్ క్వాలిఫయర్‌లో చెకియాపై కేవలం 51 బంతుల్లోనే 111 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌తో పోర్చుగల్ భారీ స్కోరు సాధించి ఘన విజయం అందుకుంది.
51 బంతుల్లో 111 పరుగులు
ముందుగా బ్యాటింగ్ చేసిన పోర్చుగల్ నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగులు చేసింది. ఇందులో హెన్రిక్స్ ప్రధాన పాత్ర పోషించాడు. 51 బంతులు ఎదుర్కొన్న అతడు 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్ 217.64గా నమోదైంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో హెన్రిక్స్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.
ఆస్ట్రేలియా తరఫున సాధ్యం కానిది..
ఆస్ట్రేలియా తరఫున 21 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన హెన్రిక్స్.. ఆ జట్టు తరఫున ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అయితే పోర్చుగల్ తరఫున తన మూడో మ్యాచ్‌లోనే శతకం బాదడం విశేషం. రీఎంట్రీలోనే సత్తా చాటడంతో అతడి ప్రదర్శనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
వర్షం.. చెకియా చిత్తు
212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెకియా ఛేజింగ్‌ను వర్షం అడ్డుకుంది. దీంతో డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ పద్ధతి ప్రకారం లక్ష్యాన్ని 8.5 ఓవర్లలో 116 పరుగులకు కుదించారు. అయితే పోర్చుగల్ బౌలర్లను ఎదుర్కోలేక చెకియా 8.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 24 పరుగులే చేసింది. దీంతో పోర్చుగల్ 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అద్భుత సెంచరీ చేసిన హెన్రిక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

error: Content is protected !!
Prajaveek Shanam