22 ఏళ్ల నాటి కేసులో మాజీ క్రికెటర్‌కు ఊరట

న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ప్రజా వీక్షణం ): భారత మాజీ క్రికెటర్, వడోదరకు చెందిన జాకబ్ మార్టిన్‌కు 22 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటంలో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మార్టిన్‌కు వ్యతిరేకంగా విశ్వసనీయమైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొన్న న్యాయస్థానం.. అన్ని ఆరోపణల నుంచి ఆయనను విముక్తి చేసింది.
2004లో కేసు నమోదు
2004లో యూకే పర్యటనకు వెళ్లిన ఓ క్రికెట్ జట్టు సభ్యుడు వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోయి, నకిలీ ఇమ్మిగ్రేషన్ స్టాంప్‌తో భారత్‌కు తిరిగి వచ్చాడు. ఈ వ్యవహారంపై నమోదైన ఎఫ్ఐఆర్‌లో చీటింగ్, ఫోర్జరీ, నకిలీ పత్రాల వినియోగం, నేరపూరిత కుట్రతో పాటు పాస్‌పోర్ట్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో జాకబ్ మార్టిన్ పేరును కూడా చేర్చారు.
ఆధారాలు లేవన్న కోర్టు
మార్టిన్‌కు వ్యతిరేకంగా నకిలీ యూకే స్టాంప్, ప్రయాణ ఏర్పాట్లు, ఆర్థిక లావాదేవీల్లో ఆయన పాత్ర ఉందని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది. అజ్వా స్పోర్ట్స్ క్లబ్‌పై ఆయనకు నియంత్రణ ఉందన్న ఆరోపణకు కూడా తగిన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. సాక్షులు సైతం ఆరోపణలను ధ్రువీకరించకపోవడంతో మార్టిన్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
‘22 ఏళ్లుగా తీవ్ర ఒత్తిడి’
తీర్పుపై జాకబ్ మార్టిన్ స్పందిస్తూ.. ఈ కేసు కారణంగా తాను 22 ఏళ్లుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నానని తెలిపారు. అంతర్జాతీయ క్రికెటర్ కావడం, తన పేరు ప్రాచుర్యంలో ఉండటంతోనే తనను కేసులో ఇరికించారని ఆరోపించారు. ఈ కేసు కారణంగా రైల్వే ఉద్యోగాన్ని కోల్పోయానని, బీసీసీఐ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా వచ్చిన క్లీన్‌చిట్ తన జీవితంలో పెద్ద మలుపు అని పేర్కొన్నారు.
భారత్ తరఫున 10 వన్డేలు
కుడిచేతి వాటం బ్యాటర్ అయిన జాకబ్ మార్టిన్ భారత్ తరఫున 10 వన్డే మ్యాచ్‌లు ఆడి 158 పరుగులు చేశారు. 22 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పుతో తనపై ఉన్న ఆరోపణల నుంచి విముక్తి లభించడంతో ఆయనకు భారీ ఊరట లభించింది.

error: Content is protected !!
Prajaveek Shanam