
హైదరాబాద్, ఆగస్టు 23 (ప్రజా వీక్షణం ): దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. బియ్యం, పంచదార, వంట నూనె, ఉల్లిపాయలు వంటి ప్రధాన దినుసుల ధరలు పెరగడంతో కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.బియ్యం, నూనె ధరలకు రెక్కలు
బియ్యం ధర కిలోకు రూ.10 వరకు పెరిగింది. పంచదార ధర బహిరంగ మార్కెట్లో కిలో రూ.64 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. వంట నూనె లీటర్ ధర రూ.180 మార్కును దాటింది. ఉల్లిపాయల ధరలు కూడా కిలో రూ.50 నుంచి రూ.70 వరకు చేరడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణ ప్రభావంతో ఉత్పత్తి తగ్గుదల
వాతావరణ పరిస్థితులు, వర్షపాతం తగ్గడం, ఖరీఫ్ పంటల సాగులో జాప్యం వంటి కారణాలతో కొన్ని పంటల ఉత్పత్తి తగ్గినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనెలకు సంబంధించిన పరిణామాలు కూడా దేశీయ ధరలపై ప్రభావం చూపుతున్నాయి.కృత్రిమ కొరతపై ఆరోపణలు
వాతావరణ పరిస్థితులను సాకుగా చూపి కొందరు వ్యాపారులు సరుకులను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యావసర ధరలను నియంత్రించేందుకు అక్రమ నిల్వలపై తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. రైతు బజార్లు, చౌకధరల దుకాణాల ద్వారా సరుకులను అందుబాటులో ఉంచి ధరలకు కళ్లెం వేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.












