అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

  • రూ.12 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
  • వరుస చోరీల కేసుల్లో కీలక పురోగతి
  • మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్టు
  • పోలీసు బృందాన్ని అభినందించిన కమిషనర్

వరంగల్, ఆగస్టు 24 (ప్రజా వీక్షణం ప్రతినిధి): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.12 లక్షల విలువైన 70.19 గ్రాముల బంగారు ఆభరణాలు, 527.9 గ్రాముల వెండి వస్తువులు, రూ.29,875 నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు చోరీ కేసుల దర్యాప్తులో ఈ కీలక పురోగతి సాధించినట్లు పోలీసులు తెలిపారు. వరుస చోరీల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు. గతంలో జరిగిన చోరీల తీరును విశ్లేషించి అనుమానితుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు సోమవారం ఉదయం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు చోరీలకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం ఆశిష్ శ్రీనివాస్ రెడ్డిమల్ల (27) పెద్దపల్లి జిల్లాకు చెందినవాడు. ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్‌లో నివసిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో అంగీకరించినట్లు తెలిపారు. పగటి సమయంలో ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రివేళల్లో చోరీలకు పాల్పడటం అతని నేర పద్ధతిగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద మిల్స్ కాలనీ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శివనగర్, ఎస్‌ఆర్‌ఆర్ నగర్ ప్రాంతాల్లో జరిగిన పలు ఇంటి చోరీలలో నిందితుడి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు.
నిందితుడికి గతంలో కూడా నేర చరిత్ర ఉన్నట్లు విచారణలో బయటపడింది. 2024, 2025 సంవత్సరాల్లో మహారాష్ట్రలో నాలుగు చోరీ కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లిన అతడు, అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే విడుదలైన తర్వాత కూడా నేరాలకు పాల్పడుతూ తిరిగి చోరీల బాట పట్టినట్లు పోలీసులు గుర్తించారు. అంతర్రాష్ట్ర స్థాయిలో నేరాలకు పాల్పడుతున్న నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, మిల్స్ కాలనీ ఇన్‌స్పెక్టర్ స్వామి, ఎస్‌ఐ మహేష్, ఏఏఓ సల్మాన్ పాషా, సీసీఎస్ మరియు మిల్స్ కాలనీ పోలీసు సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు. ప్రజలు తమ ఇళ్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.

error: Content is protected !!
Prajaveek Shanam