ధ్రువ్ జురెల్‌ శతకం.. శ్రీలంకపై అరుదైన రికార్డు

కొలంబో ఆగస్టు 24 (ప్రజా వీక్షణం ప్రతినిధి):కొలంబో టెస్టులో భారత యువ వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ (106 నాటౌట్‌) అద్భుత శతకంతో చెలరేగాడు. టెస్టుల్లో ఇది అతడి రెండో సెంచరీ. శ్రీలంకపై ఏడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ శతకం సాధించిన రెండో భారత ఆటగాడిగా జురెల్‌ అరుదైన రికార్డు సృష్టించాడు.
రెండో రోజు ఆటలో 95 పరుగులతో క్రీజులో ఉన్న జురెల్‌.. వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడిన తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. అసితా ఫెర్నాండో వేసిన ఓవర్లో సింగిల్‌ తీసి మూడంకెల స్కోరును అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో తన రెండో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.రిషభ్‌ పంత్‌ (63)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన జురెల్‌.. అనంతరం మిగిలిన బ్యాటర్లతో కలిసి భారత స్కోరును భారీ స్థాయికి తీసుకెళ్లాడు. లంచ్‌ తర్వాత దూకుడు పెంచిన ఈ యువ బ్యాటర్‌ శ్రీలంక బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు.
శ్రీలంకపై ఏడో స్థానంలో సెంచరీ చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో జురెల్‌ తాజాగా చేరాడు. గతంలో హార్దిక్‌ పాండ్యా ఈ ఘనత సాధించాడు. 2017లో పల్లెకెలె టెస్టులో పాండ్యా 108 పరుగులతో అదరగొట్టాడు. అలాగే లోయర్‌ ఆర్డర్‌లో చివరిసారిగా 2024లో ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్‌ టెస్టులో నితీశ్‌ కుమార్‌ రెడ్డి 114 పరుగులు చేశాడు.
జురెల్‌ శతకంతో భారత్‌ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తుండటంతో టీమిండియా ఇన్నింగ్స్‌ మరింత పటిష్ఠంగా మారింది.

error: Content is protected !!
Prajaveek Shanam