జురెల్‌ జోరు.. సెంచరీకి 5 పరుగుల దూరంలో

కొలంబో ఆగస్టు 24 (ప్రజా వీక్షణం ప్రతినిధి): శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ అద్భుతంగా ఆడాడు. రెండో రోజు ఆటలో నిలకడగా బ్యాటింగ్‌ చేసిన జురెల్‌ తన రెండో టెస్టు సెంచరీకి కేవలం ఐదు పరుగుల దూరంలో నిలిచాడు. అయితే కొలంబోలోని ఎస్‌ఎస్‌సీ గ్రౌండ్‌లో భారీ వర్షం కురవడంతో ఆటను ముందుగానే నిలిపివేశారు. ఆట ముగిసే సమయానికి భారత్‌ 8 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. జురెల్‌ 95, మహమ్మద్‌ సిరాజ్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.
లంచ్‌ విరామం తర్వాత తొలి బంతికే భారత్‌కు షాక్‌ తగిలింది. దూకుడుగా ఆడుతున్న రిషభ్‌ పంత్‌ 89 బంతుల్లో 63 పరుగులు చేసి కేశర నువంత బౌలింగ్‌లో లాంగ్‌ ఆఫ్‌ వద్ద క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో పంత్‌, జురెల్‌ మధ్య 112 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం మానవ్‌ సుతార్‌తో కలిసి జురెల్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై సుతార్‌ కూడా సమర్థంగా బ్యాటింగ్‌ చేశాడు. ఈ జోడీ 39 పరుగులు జోడించి భారత్‌ స్కోరును 450 దాటించింది. 18 పరుగులు చేసిన సుతార్‌ను ప్రభాత్‌ జయసూర్య ఔట్‌ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మహమ్మద్‌ సిరాజ్‌ వికెట్‌ను కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వగా.. జురెల్‌ స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ పరుగులు సాధించాడు.
స్పిన్నర్ల బౌలింగ్‌లో అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో ఆకట్టుకున్న జురెల్‌.. సోనాల్‌ దినుష బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌తో బౌండరీ సాధించి 80ల్లోకి చేరుకున్నాడు. ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో శ్రీలంక పేసర్‌ అసితా ఫెర్నాండోను బౌలింగ్‌కు దించింది. అతడి బౌలింగ్‌లోనూ జురెల్‌ మరో బౌండరీ బాది 95 పరుగులకు చేరుకున్నాడు. భారత్‌ స్కోరు 500కు చేరువవుతున్న సమయంలో భారీ వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు.
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 475/8 (131.2 ఓవర్లు)
దేవదత్‌ పడిక్కల్‌ 117, ధ్రువ్‌ జురెల్‌ 95, అసితా ఫెర్నాండో 4/78, కేశర నువంత 2/154.*

error: Content is protected !!
Prajaveek Shanam