- అమెజాన్‌కు రూ.1 లక్ష జరిమానా

న్యూఢిల్లీ, ఆగస్టు 24 (ప్రజా వీక్షణం ప్రతినిధి): ‘శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’ పేరుతో సాధారణ స్వీట్లను విక్రయించేందుకు అనుమతించినందుకు అమెజాన్‌కు జరిమానా పడింది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ.1 లక్ష జరిమానా విధించింది. సంబంధిత ఉత్పత్తులకు శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి అనుమతి ఉన్నట్లు ఆధారాలు లేవని సీసీపీఏ పేర్కొంది.
అనుమతి లేకుండా సాధారణ స్వీట్లను ‘శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’ పేరుతో విక్రయించడం వినియోగదారులను తప్పుదోవ పట్టించే వాణిజ్య పద్ధతిగా సీసీపీఏ అభివర్ణించింది. అంతేకాకుండా లక్షలాది మంది భక్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపింది. అమెజాన్ వంటి భారీ ఈ-కామర్స్ వేదికపై ఉత్పత్తుల జాబితా ఉండటం వల్ల వాటి ప్రామాణికతపై వినియోగదారుల్లో తప్పుడు నమ్మకం కలిగే అవకాశం ఉందని పేర్కొంది.
2024 జనవరి 22న అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణప్రతిష్ఠకు ముందు ఈ తరహా ఉత్పత్తులను అమెజాన్‌లో జాబితా చేసినట్లు సీసీపీఏ తెలిపింది. దీనిపై 2024 జనవరి 19న అమెజాన్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయగా.. అనంతరం సంబంధిత లిస్టింగ్‌ను తొలగించింది. అయితే ఇలాంటి లిస్టింగ్‌లను ముందుగానే నిరోధించేందుకు ప్లాట్‌ఫామ్ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని సీసీపీఏ స్పష్టం చేసింది.
వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఇ-కామర్స్ నిబంధనలు-2020 ప్రకారం తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అమెజాన్‌ను బాధ్యురాలిగా నిర్ధారించిన సీసీపీఏ.. రూ.1 లక్ష జరిమానాను 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. సంబంధిత సంస్థల ధ్రువీకరించిన అనుమతి లేకుండా ఏ మత సంస్థ లేదా ప్రముఖ ఆలయానికి సంబంధించిన ప్రసాదం, మహాప్రసాదం, భోగ్ వంటి మతపరమైన ఉత్పత్తులను ప్లాట్‌ఫామ్‌పై జాబితా చేయడం, ప్రచారం చేయడం లేదా విక్రయానికి అందుబాటులో ఉంచకూడదని అమెజాన్‌ను ఆదేశించింది.
ఈ నిబంధనలు శ్రీ రామ్ జన్మభూమి ఆలయంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయం, శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం, శ్రీ జగన్నాథ ఆలయం, శ్రీ కేదార్నాథ్, శ్రీ బద్రీనాథ్, శ్రీ సోమనాథ్, శ్రీ ద్వారకాధీష్, శ్రీ మహాకాలేశ్వర ఆలయాలకు వర్తించనున్నాయి.












