
న్యూఢిల్లీ, ఆగస్టు 24 (ప్రజా వీక్షణం ప్రతినిధి): భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ప్రజాదరణ పొందిన బజాజ్ పల్సర్ 150 కొత్త అవతార్‌లో విడుదలైంది. రూ.1.15 లక్షల ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్‌లో ఇంజిన్, డిజైన్, సాంకేతిక ఫీచర్లలో కంపెనీ పలు మార్పులు చేసింది. పాత మోడల్‌తో పోలిస్తే ధర రూ.4,000 నుంచి రూ.9,000 వరకు పెరిగినప్పటికీ.. అదనపు ప్రీమియం ఫీచర్లను అందించింది.
కొత్త పల్సర్ 150 మూడు వేరియంట్లలో లభిస్తుంది. సింగిల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1.15 లక్షలు కాగా.. ట్విన్ డిస్క్ సింగిల్ సీట్ మోడల్ రూ.1.22 లక్షలు, ట్విన్ డిస్క్ స్ప్లిట్ సీట్ మోడల్ రూ.1.23 లక్షలుగా నిర్ణయించారు.
150సీసీ ఇంజిన్ 14 పీఎస్ పవర్, 14.1 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన గేర్‌బాక్స్‌తో పాటు రైడర్ల సౌకర్యం కోసం రెయిన్, రోడ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను అందించారు. కొత్త ఫ్రేమ్‌తో పాటు వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లకు బదులుగా మోనోషాక్ సస్పెన్షన్‌ను అమర్చారు.
డిజైన్‌లో స్మోక్డ్ ఎఫెక్ట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డీఆర్ఎల్స్, హజార్డ్ ల్యాంప్స్ ఆకట్టుకోనున్నాయి. టాప్ ట్విన్ డిస్క్ వేరియంట్లో 5 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, ఐఎస్జీ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్లు అందించారు.












