దశాబ్దం పూర్తి చేసుకున్న యూపీఐ..!

న్యూఢిల్లీ, ఆగస్టు 24 (ప్రజా వీక్షణం ప్రతినిధి): యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సేవలు అందుబాటులోకి వచ్చి దశాబ్దం పూర్తవుతోంది. 2016 ఆగస్టు 25న యూపీఐ లావాదేవీలను ప్రభుత్వం ప్రారంభించింది. దేశీయ డిజిటల్‌ పేమెంట్స్‌ వ్యవస్థను బలోపేతం చేయడంలో యూపీఐ కీలక పాత్ర పోషిస్తోంది. 2016-17లో 1.78 కోట్లుగా ఉన్న వార్షిక యూపీఐ లావాదేవీల సంఖ్య.. 2025-26 నాటికి 24,162 కోట్లకు చేరింది. అంటే దాదాపు 13 వేల రెట్లు లావాదేవీల సంఖ్య పెరిగింది. ఇదే సమయంలో లావాదేవీల విలువ రూ.0.07 లక్షల కోట్ల నుంచి రూ.314 లక్షల కోట్లకు చేరినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. దీంతో ట్రాన్సాక్షన్‌ వాల్యూ సుమారు 4 వేల రెట్లు పెరిగింది.
2016లో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)ను ఏర్పాటు చేశారు. ఆర్‌బీఐ ఆధ్వర్యంలో ఎన్‌పీసీఐ పనిచేస్తోంది. భారత డిజిటల్‌ పేమెంట్స్‌ వ్యవస్థలో యూపీఐ ప్రత్యేక గుర్తింపు పొందింది. ట్రాన్సాక్షన్‌ వాల్యూమ్‌ 188 శాతం, ట్రాన్సాక్షన్‌ వాల్యూ 155 శాతం పెరిగినట్లు సీఏజీఆర్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థలో వచ్చిన పురోగతితో యూపీఐ వినియోగం కూడా భారీగా పెరిగింది. 2016లో కేవలం 44 బ్యాంకులు యూపీఐ సేవలను ప్రారంభించగా.. 2026 జూలై నాటికి ఆ సంఖ్య 741కి చేరింది.
2026లో యూపీఐ ద్వారా రోజుకు సగటున సుమారు 66 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. 2025-26లో దేశీయ డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ వాటా 84 శాతంగా నమోదైంది. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్‌ పేమెంట్‌ వ్యవస్థగా యూపీఐ గుర్తింపు పొందినట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి పేర్కొంది. ప్రస్తుతం యూఏఈ, ఫ్రాన్స్‌, భూటాన్‌, శ్రీలంక, నేపాల్, సింగపూర్‌, మారిషస్‌, ఖతార్‌, కంబోడియా, గ్రీస్‌, మాల్దీవులు సహా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి.
2016 ఆగస్టులో యూపీఐ ద్వారా కేవలం 90 వేల లావాదేవీలు జరగగా.. 2026 మే నాటికి నెలవారీ లావాదేవీల సంఖ్య సగటున 2,300 కోట్లకు పెరిగినట్లు అంచనా.

error: Content is protected !!
Prajaveek Shanam