
కొలంబో ఆగస్టు 26 ప్రజావీక్షణం ప్రతినిధి): శ్రీలంక యువ బ్యాటర్ సోనాల్ దినుషా టీమిండియాపై అద్భుత ప్రదర్శనతో అరుదైన రికార్డు సృష్టించాడు. కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో 103 పరుగులతో సెంచరీ సాధించిన దినుషా.. భారత్‌పై తాను ఆడిన తొలి రెండు టెస్టుల్లోనూ శతకాలు బాదిన రెండో శ్రీలంక బ్యాటర్‌గా నిలిచాడు. 1982లో శ్రీలంక దిగ్గజం దులీప్ మెండిస్ సాధించిన ఈ ఘనతను 44 ఏళ్ల తర్వాత దినుషా సమం చేశాడు.
భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న దినుషా.. తన కెరీర్లో భారత్‌పై ఆడిన తొలి రెండు టెస్టుల్లోనూ సెంచరీలు సాధించిన అరుదైన బ్యాటర్‌గా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో భారత్‌పై తొలి రెండు టెస్టుల్లో శతకాలు చేసిన ఎనిమిదో బ్యాటర్‌గా కూడా రికార్డుల్లోకి ఎక్కాడు.
మూడు ఇన్నింగ్స్‌ల్లో 287 పరుగులు
ఈ సిరీస్‌లో దినుషా బ్యాటింగ్ భారత బౌలర్లకు సవాలుగా మారింది. గాలేలో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 100 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులతో రాణించాడు. ఇప్పుడు కొలంబో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగులు చేశాడు. ఇప్పటివరకు మూడు ఇన్నింగ్స్‌ల్లో 95.67 సగటుతో 287 పరుగులు సాధించాడు.
లంక దిగ్గజాల సరసన..టీమిండియాపై వరుస టెస్టుల్లో సెంచరీలు సాధించిన శ్రీలంక బ్యాటర్ల జాబితాలో దినుషా కూడా చేరాడు. అరవింద డిసిల్వా, కుమార సంగక్కర భారత్‌పై వరుసగా మూడు టెస్టుల్లో సెంచరీలు సాధించగా.. సనత్ జయసూర్య, మహేల జయవర్ధనే, తరంగ పరనవితాన, ఏంజెలో మాథ్యూస్ రెండు టెస్టుల్లో ఈ ఘనత సాధించారు. ఇప్పుడు దినుషా కూడా వారి సరసన నిలిచాడు.
2026లోనూ టాప్ బ్యాటర్
ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలోనూ దినుషా అగ్రస్థానానికి చేరుకున్నాడు. 2026లో ఇప్పటివరకు ఏడు ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు 77 సగటుతో 462 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది 350కి పైగా పరుగులు చేసిన అంతర్జాతీయ బ్యాటర్లలో అత్యుత్తమ సగటు కలిగిన ఆటగాడిగా దినుషా నిలిచాడు.












