వంట నూనె అమ్మకాలపై కఠిన ఆంక్షలు

ముంబయి, ఆగస్టు 26 (ప్రజా వీక్షణం ప్రతినిధి): వంట నూనె విక్రయాల్లో కల్తీని అరికట్టి, ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్యాకెట్‌ లేకుండా వంట నూనెను విక్రయించడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. తయారీదారుల నుంచి రిటైలర్లు, ఆన్‌లైన్‌ విక్రేతల వరకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.
ప్యాకెట్‌ లేకుండా విక్రయిస్తే చర్యలు
వంట నూనెను తప్పనిసరిగా సీల్‌ చేసిన, భద్రమైన ప్యాకేజీలోనే విక్రయించాలి. లూజ్‌గా లేదా ప్యాకెట్‌ లేకుండా నూనె విక్రయిస్తే చర్యలు తీసుకోనున్నారు. కల్తీ, నాసిరకం నూనె విక్రయాలు, తప్పుడు లేబులింగ్‌ వంటి ఉల్లంఘనలపైనా అధికారులు దృష్టి సారించారు.
రూ.10 లక్షల వరకు జరిమానా
అసురక్షిత ఆహారం విక్రయించడం లేదా సరైన అనుమతులు లేకుండా వ్యాపారం నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. నాసిరకం నూనెకు రూ.5 లక్షల వరకు, తప్పుదోవ పట్టించే లేబులింగ్‌కు రూ.3 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. నిబంధనల తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా ఉండొచ్చని అధికారులు హెచ్చరించారు.
ఆవ నూనెలో కల్తీకి చెక్‌
ఆవ నూనెలో ఇతర నూనెలను అనధికారికంగా కలపడాన్ని కూడా నిషేధించారు. ఆవ నూనెను స్వచ్ఛమైనదిగానే విక్రయించాలని స్పష్టం చేశారు. చౌకైన నూనెలను కలపడం, లేబుళ్లు మార్చడం, గడువు సమీపించిన నూనెను తిరిగి ప్యాక్‌ చేయడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు.
పాత డబ్బాల్లో నూనె వద్దు
మినరల్‌ ఆయిల్‌, పెయింట్లు, రసాయనాలు లేదా ఇతర పదార్థాలను నిల్వ చేసిన కంటైనర్లను వంట నూనె కోసం తిరిగి ఉపయోగించడాన్ని నిషేధించారు. తుప్పుపట్టిన, పగిలిన లేదా దెబ్బతిన్న డబ్బాల్లో నూనె విక్రయించకూడదని సూచించారు.
వాడిన నూనెను మళ్లీ వేడి చేయొద్దు
హోటళ్లు, రెస్టారెంట్లలో నూనెను పదేపదే వేడి చేసి ఉపయోగించడంపైనా అధికారులు ఆంక్షలు విధించారు. ఇలా చేయడం వల్ల హానికరమైన పదార్థాలు పెరిగే అవకాశం ఉన్నందున, వాడిన నూనెను మళ్లీ ఆహార తయారీలో ఉపయోగించవద్దని సూచించారు.
వ్యాపారుల అభ్యంతరాలతో కొత్త విధానం
ఈ నిబంధనలపై వ్యాపారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ జోక్యం చేసుకున్నారు. ఆహార భద్రతకు భంగం కలగకుండా సంప్రదాయ వ్యాపారాలు కొనసాగేందుకు ప్రత్యేక కార్యాచరణ విధానాన్ని రూపొందించాలని ఆహార, ఔషధ పరిపాలన శాఖను ఆదేశించారు.

error: Content is protected !!
Prajaveek Shanam