భారత్‌ భేష్‌.. ‘బీబీబీ’ రేటింగ్‌ కొనసాగింపు!

న్యూఢిల్లీ ఆగస్టు 28 (ప్రజా వీక్షణం ప్రతినిధి): భారత ఆర్థిక వ్యవస్థకు అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ మరోసారి స్థిరమైన ‘బీబీబీ’ రేటింగ్‌ను కొనసాగించింది. భారత్‌ స్పష్టమైన, స్థిరమైన, సానుకూల విధానాలతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేర్కొంది. దేశ ఆర్థిక మూలాలు పటిష్ఠంగా ఉన్నాయని, వచ్చే 2-3 సంవత్సరాల్లో బలమైన వృద్ధికి ఇవి దోహదం చేస్తాయని వెల్లడించింది.
అయితే పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా పెరిగిన ఇంధన ధరలు, ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్ల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత్‌ జీడీపీ వృద్ధి 6.6 శాతానికి తగ్గొచ్చని ఎస్‌ అండ్‌ పీ అంచనా వేసింది. వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాల్లో మాత్రం సగటు వార్షిక వృద్ధి 7 శాతంగా ఉండవచ్చని పేర్కొంది.
గడిచిన ఐదేళ్లలో (2021-22 నుంచి 2025-26) భారత్‌ సగటు వార్షిక వృద్ధి 7.9 శాతంగా నమోదైందని తెలిపింది. 2025-26లో వృద్ధి రేటు 7.7 శాతంగా ఉన్నట్లు వివరించింది. మౌలిక వసతులపై భారీ పెట్టుబడులు, విధానాల్లో స్థిరత్వం దీర్ఘకాలిక వృద్ధికి మరింత మద్దతు ఇస్తాయని పేర్కొంది.
రేటింగ్‌కు సవాళ్లు
ప్రభుత్వ బలహీన ఆర్థిక పనితీరు, భారీ రుణభారం, తక్కువ తలసరి ఆదాయం వంటి అంశాలు భారత పరపతికి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని ఎస్‌ అండ్‌ పీ హెచ్చరించింది. అయినప్పటికీ మెరుగైన వృద్ధి అవకాశాలు, స్థిరమైన ఆర్థిక, ద్రవ్య విధానాలు ప్రభుత్వ రుణ, వడ్డీ భారాన్ని కొంత మేర తగ్గించగలవని తెలిపింది.
ఇంధనం, ఆహార ధరల పెరుగుదలతో స్వల్పకాలికంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. అది ఆర్‌బీఐ నిర్దేశించిన 2-6 శాతం పరిధిని దాటకపోవచ్చని ఎస్‌ అండ్‌ పీ అంచనా వేసింది.
18 ఏళ్ల తర్వాత అప్‌గ్రేడ్‌: ఎస్‌ అండ్‌ పీ 2025 ఆగస్టులో 18 ఏళ్ల తర్వాత భారత్‌ పరపతి రేటింగ్‌ను ‘బీబీబీ మైనస్‌’ నుంచి ‘బీబీబీ’కి పెంచింది. మరోవైపు ఫిచ్‌ మాత్రం ఈ నెల ప్రారంభంలో భారత్‌కు ‘బీబీబీ మైనస్‌’ రేటింగ్‌ను స్థిర వైఖరితో కొనసాగించింది.

error: Content is protected !!
Prajaveek Shanam